పిడుగుపాటుకు గాయపడిన వ్యక్తి మృతి
తొట్టంబేడు: గత నెల 21న పిడుగుపాటుకు తీవ్రగా గాయపడిన తొట్టంబేడు మండలం కొత్తకండ్రిగ గ్రామానికి చెందిన టి.నరసింహారెడ్డి (36) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. టి.నరసింహారెడ్డి గత నెల 21న కొత్తకండ్రిగ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న తన పొలంలో వరినాట్లు వేస్తున్నాడు. వర్షం కురవడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నాడు. ఈ క్రమంలో అతని పక్కనే పిడుగు పడడంతో తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోయింది. అతని తొడ వద్ద గాయమై రక్తస్రావమైంది. అతన్ని కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


