సెల్‌ఫోన్ చూడొద్దని మందలించడంతో..
– మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
తడ: సెల్‌ఫోన్‌పైనే కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఓ తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తడ ఎస్‌ఐ కొండనాయుడు తెలిపిన వివరాల మేరకు.. కారూరు గ్రామంలో బేల్దారి పని చేసుకుని జీవించే కుమార్‌కు కొడుకు నవీన్ రాజు, కుమార్తె చిత్ర(16) ఉన్నారు. ఆరంబాకం పాఠశాలలో కూతురు చిత్ర ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే సెల్‌ఫోన్ ఎక్కువ చూస్తుండడంతో శనివారం తండ్రి మందలించాడు. తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిత్ర చీరతో ఉరి వేసుకుంది. కొంత సమయానికి ఇంటికి వచ్చిన బాలిక సోదరుడు బంధువుల సాయంతో చిత్రను శ్రీసిటీ ఆస్పత్రికి, అనంతరం సూళ్లూరుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చైన్నె స్టాన్లీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన ఎస్‌ఐ దర్యాప్తు చేపట్టారు.
హోరాహోరీగా బేస్‌బాల్ పోటీలు
పలమనేరు : పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 69వ స్కూల్ గేమ్స్‌లో భాగంగా రాష్ట్ర స్థాయిలో సాగుతున్న బేస్‌బాల్ అండర్–14 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఈ పోటీలకు 500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన బాలుర పోటీల్లో శ్రీకాకుళంపై విజయనగరం, వెస్ట్ గోదావరిపై ఈస్ట్ గోదావరి, ప్రకాశం జట్టుపై చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది. నేడు జరిగే పోటీల్లో బాలికల విభాగంలో చిత్తూరు–అనంతపూర్, శ్రీకాకుళం–ఈస్ట్‌గోదావరి, గుంటూరు– విజయనగరం, కడప–వైజాగ్ జట్ల మధ్య క్వార్టర్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆపై సెమీస్, ఫైనల్స్ ఉంటాయన్నారు. ఇందులో నిర్వాహకులు బాబు, సాంబశివ, శశి, ప్రకాష్, స్థానిక హెచ్‌ఎం షంషీర్ తదితరులు పాల్గొన్నారు.


