కొత్త పింఛన్ల ఊసే లేదు..
కానీ వరుసగా పింఛన్ల కోతలు 18 నెలలు.. 13,979 ఫించన్ల తగ్గింపు ఈ నెలలో మరో 448 తగ్గింపు వచ్చే నెలలో తుది జాబితా విడుదల వికలత్వం తగ్గిస్తే మళ్లీ పోరాటమే అంటున్న లబ్ధిదారులు
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఎన్టీఆర్ సామాజిక భద్రత ఫించన్లు కోత కొనసాగుతూనే ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు 18 నెలల వ్యవధిలో జిల్లాలో 13,979 మంది పింఛన్లు తగ్గించారు. గత నవంబర్ నెలలో 2,62,556 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ డిసెంబర్ నెలకు 2,62,108 మందికి పింఛన్లు అందించనున్నారు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలోనే 448 మందికి తగ్గించారు. ప్రతి నెల 600 నుంచి 700 పింఛన్లు తగ్గిపోతున్నాయి.
విజయవాడలో ఉందంట ఆ జాబితా..
పింఛన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోందని డీఆర్‌డీఏ అధికారులను ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారని సమాధానం ఇస్తున్నారు. మృతి చెందిన వారి జాబితా ఇవ్వాలని కోరితే తమ వద్దలేదని విజయవాడలోని డీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తీసుకోమని సమాధానం ఇస్తున్నారు. మరోవైపు భర్త చనిపోయి వితంతువులైన వారు 8,250 మందికి పైగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు అర్హులైన వయోవృద్ధులు 10,300 మందికి పైగా పింఛన్ల కోసం జిల్లాలో ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త పింఛన్ల ఊసే ఎత్తని ప్రభుత్వం ఉన్న పింఛన్లను తగ్గించే పనిలో ఉంది. గత మూడు నెలల క్రితం జిల్లాలో దివ్యాంగులు, వ్యాధిగ్రస్తుల 7,600 పింఛన్లు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా న్యాయం కోసం పెద్దఎత్తున పోరాటం చేస్తున్నారు. అయితే గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన పాత డాక్టర్లచే మళ్లీ పరీక్షలు చేయిస్తున్నారు. మరో నెల రోజుల్లో (వచ్చే జనవరిలో)ఈ పరీక్షల ప్రక్రియ పూర్తి అవుతుందని, అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు. అందులో ఎంతమందికి మళ్లీ వికలత్వం తగ్గించి సర్టిఫికెట్లు ఇస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. న్యాయం కోసం మరోసారి పోరాటాలు చేస్తామని దివ్యాంగుల సంఘం నేతలు ముందే హెచ్చరిస్తున్నారు.
లక్షమంది ఎదురు చూపులు..
సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తే జిల్లాలో మరో లక్ష మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. వారు ఎంతో ఆశగా చూస్తున్నారు.


