గ్రామకంఠాన్ని వదల్లేదుగా..! | - | Sakshi
Sakshi News home page

గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!

Dec 1 2025 7:42 AM | Updated on Dec 1 2025 7:42 AM

గ్రామ

గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!

రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లిలోని ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా ఆక్రమణ వరుస ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు కలెక్టర్‌కు చెప్పుకున్నా గ్రామకంఠంలో ఆగని అక్రమ నిర్మాణాలు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్న గ్రామస్తులు

అధికార పార్టీకి చెందిన ఆక్రమణదారులు కాలువలు, కుంటలు, గుట్టలే కాదు గ్రామకంఠం భూమినీ వదలడం లేదు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డులు అన్నీ చెబుతున్నా.. ఆ భూమి గ్రామకంఠానికి చెందినది గ్రామస్తులు చెబుతున్నా ఆక్రమణదారులు యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నా.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా లెక్క చేయడం లేదు.. ఎవరు ఎన్ని అడ్డు చెప్పినా అవేవీ పట్టించుకోకుండా ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారు.

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : జిల్లాలో ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాల ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొందరు టీడీపీ నేతలు అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని చేతులు కలిపి కోట్లు విలువైన ప్రభుత్వ భూములను అప్పగించేస్తున్నారన్న విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీ బొప్పరాజుపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న సర్వేనంబరు 184/4లో సుమారు 2.50 ఎకరాల గ్రామ కంఠం భూమిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత గుట్టుగా ఆక్రమించి ఫెన్సింగ్‌ రాళ్లు నాటారు. ఆ సమయంలో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా తహసీల్దారు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రాళ్లను ఏమాత్రం తొలగించకుండా అలాగే వదిలేశారు. తాజాగా ఆ రాళ్లు మధ్య ఉన్న భూమిలో గుట్టుగా ఇంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. కోట్లు విలువైన గ్రామకంఠం భూమిలో బహిరంగంగా ఇంటి నిర్మాణాలు సాగించినా సరే ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యక్ష ఆందోళనలకు రంగం సిద్ధం

గ్రామ కంఠం భూమిని గ్రామ అవసరాలకు కాకుండా ఓ అధికార పార్టీకి కట్టబెడుతున్న తహసీల్దారు, ఇతర రెవెన్యూ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్న జిల్లా కలెక్టర్‌ తీరుకు నిరసనగా గ్రామంలో ఇంటికి ఒకరు చొప్పున ప్రత్యక్ష ఆందోళనలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఇదే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రులకు ఫిర్యాదులు చేస్తామని, అప్పటికీ స్పందించకుంటే కోర్టుల్లో దావాలు వేస్తామని హెచ్చరించారు.

వరుస ఫిర్యాదులు చేసినా ఆపేదెవరు ?

గ్రామంలోని ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు పచ్చపార్టీకి చెందిన ఓ నాయకుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పావులుకదుపుతుండడం, ఆ నాయకుడి నియోజకవర్గ స్థాయి నాయకుడు అండగా నిలబడడంతో ఆక్రమిత భూమిలో యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు కళ్ల ముందే ఆక్రమిస్తున్నా అధికారులకు కనిపించడం లేదా..? సామాన్య ప్రజలు జానెడు స్థలం ఆక్రమిస్తే తొలగించేంతవరకు నిద్రపోని రెవెన్యూ అధికారులకు ఈ దారుణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ఇదే విషయంగా రామచంద్రాపురం మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్‌ను, మండల తహసీల్దారును కలసి పలుమార్లు వినతిపత్రాలు అందించారు.

గ్రామకంఠాన్ని వదల్లేదుగా..! 1
1/2

గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!

గ్రామకంఠాన్ని వదల్లేదుగా..! 2
2/2

గ్రామకంఠాన్ని వదల్లేదుగా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement