5న ఆకేపాటి తిరుమల మహా పాదయాత్ర
తిరుపతి కల్చరల్: అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలినడక మార్గాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కడప మాజీ జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఈ నెల 5వ తేదీన 23వ తిరుమల మహా పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వ్యక్తిగత సహాయకుడు శంకరయ్య తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మహాపాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య మార్గం పునరుద్ధరణకు 22 ఏళ్లుగా తిరుమల మహాపాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రను వేలాది మందితో తిరుమలకు వెళుతున్నట్లు వివరించారు. కడప వైపుగా కాలినడక మార్గాన్ని భక్తుల సౌకర్యార్థం టీటీడీ అభివృద్ధి చేయాలన్నదే అమరనాథరెడ్డి సంకల్పమని తెలిపారు. పాదయాత్రలో భాగంగా గోవిందమాల ధారణతో పాల్గొనే భక్తులకు అల్పాహారం, భోజనం, వైద్య సేవలు వంటి సౌకర్యాలను ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షిస్తారన్నారు. ఈ సమావేశంలో కల్లూరు చెంగయ్య, ప్రతాప్, కృష్ణ పాల్గొన్నారు.


