
సమరం
కూటమి మోసాలపై
చంద్రబాబు మేనిఫెస్టోను ప్రతి గడపకూ తీసుకెళ్దాం
● వంచించడంలో బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి ● ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి ● నాగలాపురం సమావేశంలో భూమన కరుణాకరరెడ్డి దిశా నిర్దేశం
వరదయ్యపాళెం : చంద్రబాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల కేంద్రంలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే అంశంపై నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను ఏడాది పూర్తయినా అమలు చేయకపోగా ప్రజలను మోసం చేసే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ పథకాలను గాలికొదిలేసి రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ రాజకీయాలకు కూటమి నాంది పలుకుతోందని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ప్రతి గడపకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఒక్క చక్కటి అవకాశమని , ఆ దశగా ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు నడుం బిగించి ప్రజలకు తెలియజేయడంలో ముందుండాలని భూమన పిలుపునిచ్చారు.
అన్ని వర్గాలకూ దగా
సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సంపద సృష్టిస్తా నని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. కూటమి ఏడాది పాలనలో ఎక్కడా లేనంత ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నారని, దాని ఫలితమే జగనన్న ఎక్కడికి వెళ్లినా జనం జేజేలు కొడుతున్నారన్నారు. ఆ ఆదరణను చూసి ఓర్వలేక జగనన్న పర్యటనలకు కుట్రలు పన్నుతున్నారన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, పార్టీ శ్రేణులతో కలసి ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సెల్‌ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయించి అందులో చంద్రబాబు మోసాలను ప్రజలకు వారి ఫోన్ల ద్వారానే వివరించాలని సూచించారు.
జగన్ 2.0 లో కార్యకర్తలకే ప్రాధాన్యం
నాగలాపురంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు. దీనిపై స్పందించిన జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని, ఆ దిశగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడగులు వేస్తున్నారన్నారు. కూటమి పాలనలో ప్రతి అంశాన్ని జగన్ మోహన్‌రెడ్డి నిశ్చితంగా పరిశీలిస్తున్నారని, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ అందిస్తారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ సారథ్యంలో సత్యవేడు గెలుపునకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధవి రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వేలూరు రాకేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, పళ్లికొండేశ్వరాలయ మాజీ చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు అపరంజిరాజు (నాగలాపురం), సుశీల్‌కుమార్ రెడ్డి (సత్యవేడు), నాయుడు దయాకర్ రెడ్డి (వరదయ్యపాళెం), గవర్ల కృష్ణయ్య (కేవీబీపురం), మణి నాయుడు (బీఎన్‌కండ్రిగ), చలపతిరాజు (పిచ్చాటూరు), సొరకాయలు (నారాయణవనం), మండల రైతు విభాగం అధ్యక్షులు చిన్నదొరై, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
9న వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయండి
ఆపదలో ఉన్న మామిడి రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈనెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డ్‌కు వస్తున్న మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని సత్యవేడు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలో సైతం పెద్దఎత్తున రైతులు మామిడి పంటను సాగు చేశారని, అయితే ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా మామిడి రైతులు నష్టపోయారని, అందుకు కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

సమరం