
కలెక్టరేట్‌లో నేడు గ్రీవెన్స్
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులతో పాటు పలు విభాగాలకు చెందిన జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారులకు తెలియజేయడానికి అవకాశం కల్పించారు.
విద్యుత్ సర్వీసులపై
ఆకస్మిక తనిఖీలు
తిరుపతి రూరల్ : తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలోని కోట సబ్ డివిజన్ వాకాడు, చిట్టమూరు సెక్షన్లలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత విద్యుత్తు శాఖ డీపీఈ విభాగపు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా చేపల పెంపకం చేపడుతున్న అక్వా రైతుల పొలాల వద్దకు వెళ్లి చేపల చెరువులకు వినియోగించే విద్యుత్తు సర్వీసులను తనిఖీ చేశారు. వాకాడు, చిట్టమూరు సెక్షన్ల పరిధిలో అనధికారిక విద్యుత్తు కనెక్షన్లు తీసుకుని విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్టు డీపీఈ విభాగపు ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు గంగాధర్ రెడ్డి తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 87,536 మంది స్వామి వారిని దర్శించుకోగా 35,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.33 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్‌లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.