
ఏడాది పాలనపై కలెక్టర్ సంతృప్తి
తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అవసరాల నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం వైఎస్సార్‌సీపీ సర్కార్ 2022 ఏప్రిల్ 4న జిల్లాల పునర్విభజన చేపట్టి తిరుపతి జిల్లా ఏర్పాటు చేశారు. మొదటి కలెక్టర్‌గా వెంకట రమణారెడ్డి రెండేళ్లపాటు పనిచేశారు.ఆ తర్వాత లక్షీశ నెల రోజులు, అనంతరం ప్రవీణ్‌కుమార్ మూడు నెలలు, అనంతరం వెంకటేశ్వర్ ఏడాది పాటు జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టరేట్‌లోని ఉద్యోగులు విభాగాల వారీగా శుక్రవారం కలెక్టరేట్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టరేట్‌లోని ఉద్యోగులే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పలువురు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఏడాది పాలనపై శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా ఏడాదిపాటు తిరుపతి జిల్లా కలెక్టర్‌గా పాలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
శ్రీసిటీని సందర్శించిన సిక్కీ బృందం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : చైన్నెలోని దక్షిణ భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (ఎస్‌ఐసీసీఐ)కి చెందిన 22 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ పారిశ్రామిక కార్యకలాపాలు, ఇక్కడ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతుల అధ్యయనం, పెట్టుబడి అవకాశాల పరిశీలన దిశగా వీరి పర్యటన సాగింది. శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) బోడ్గన్ జార్జ్ బృంద సభ్యులకు స్వాగతం పలికారు. చర్చల సందర్భంగా శ్రీసిటీ అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక స్థానం, వ్యాపారానుకూల పర్యావరణ వ్యవస్థకు సంబంధించి వారికి ప్రదర్శన ఇచ్చారు. శ్రీసిటీలో విస్తృత వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. ఈ పర్యటనపై స్పందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, దక్షిణ భారతదేశ వ్యాపార స్వరూపాన్ని రూపొందించడంలో సిక్కీ పాత్ర ఎంతో కీలకం, విలువైనదని వ్యాఖ్యానించారు. వివిధ రంగాలలోని ప్రముఖ వ్యాపార సంస్థలు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులతో కూడిన ఈ బృందం పరిశ్రమలను సందర్శించింది. సిక్కీ ప్రాజెక్ట్స్ హెడ్ ఆర్.శరణ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పర్యటన కొనసాగింది.
ఎర్రచందనం కేసులో ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడుకు చెందిన వళ్లియన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ ఫారెస్ట్ సిబ్బంది 2019లో శేషాచలం అటవీ ప్రాంతం, నాగపట్ల బీట్, చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. నిందితుడు వళ్లియన్ ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నించాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ఏడాది పాలనపై కలెక్టర్ సంతృప్తి