
శ్రీసిటీకి పోలీస్ బాస్ ఎవరు?
● ఉద్యోగ విరమణ పొందిన హైటెక్ స్టేషన్ డీఎస్పీ ● నెల నుంచి ఖాళీగా పోస్టు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారు. అయితే శ్రీసిటీలోని హైటెక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ పోస్టు నెల నుంచి ఖాళీగానే ఉంది. మే నెలాఖరున డీఎస్పీ పైడేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఆ పోస్టు భర్తీ చేయలేదు. నాయుడుపేట డీఎస్పీకి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ఎందుకీ నిర్లక్ష్యం
శ్రీసిటీలో ఇప్పటికే పలు దేశాలకు చెందిన 250 పరిశ్రమలు ఉన్నాయి. 70వేల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. పలు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు రోజువారీ పారిశ్రామికవేత్తలు ఇతర ముఖ్యులు పర్యటిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీసిటీ పారిశ్రామికవాడలోని హైటెక్ పోలీస్ స్టేషన్‌కు నెల నుంచి డీఎస్పీని నియమించకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అలాగే ఈ పోలీస్ స్టేషన్‌కు ఇప్పటి వరకు పూర్తిస్థాయి సిబ్బందిని కూడా భర్తీ చేయలేదు. ఇప్పటికై నా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి పారిశ్రామికపరంగా ఎంతో ప్రాధాన్యత గల శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్‌కు డీఎస్పీని నియమించాలని పలు పరిశ్రమల ప్రతినిధులు, ఉద్యోగులు కోరుతున్నారు.