
కార్యదర్శుల పనితీరుపై ఆగ్రహం
బుచ్చినాయుడుకండ్రిగ : గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్యదర్శులు పనితీరు మార్చుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారిణి సుశీలాదేవి హెచ్చరించారు. శుక్రవారం కారణి గ్రామంలో పర్యటించి, ఎంపీడీఓ కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో దోమల నివారణకు మురుగు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయించి, వీధుల్లో బ్లీచింగ్ చేయించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. తాగునీటి పైపులైన్ లీకేజీలను అరికట్టాలని, తాగునీటి సమస్యలు లేకుండా, వీధులలో గుంతలు ఉంటే పూడ్చాలని తెలిపారు. అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టకపోతే ఉపేక్షించేదేలేదన్నారు. ఈక్రమంలో ఈఓపీఆర్‌డీ రాజశేఖర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నమ్మ, సర్పంచ్ పద్మమ్మ పాల్గొన్నారు.