
పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంఏ తెలుగు, డిప్లొమా ఇన్ మ్యూజిక్ (సంకీర్తన, వర్ణం, అన్నమయ్య అంతరంగం)లో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారం, అర్హత, కోర్సులు, ఫీజు వంటి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, స్పాట్ అడ్మిషన్ల కోసం సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0877–2284524, 8121787415ను సంప్రదించాలని సూచించారు.
రేపు జాబ్‌మేళా
తిరుపతి అర్బన్ : తిరుపతిలోని పద్మావతిపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా ఉంటుందని చెప్పారు. పలు బహుళజాతి కంపెనీలకు చెందిన వారు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి హాజరు కానున్నారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చదువుకున్న యువత అర్హులుగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు ముందుగా తమ పేర్లును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదనపు సమాచారం కోసం 85559 72657, 99888 53335 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
టీటీడీ ఉద్యోగులకు
హెల్మెట్ల పంపిణీ
తిరుమల : టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, అమాలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2 వేల హెల్మెట్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సదా లక్ష్మీ, అన్న ప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.