
యువత సన్మార్గంలో నడవాలి
తిరుపతి అర్బన్ : యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ర్యాలీగా ఎంఆర్‌పల్లి సర్కిల్ వరకు వెళ్లారు. ఎంఆర్‌పల్లి సర్కిల్‌లో మానవహారం చేపట్టారు. తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొందరు యువకులు డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ప్రతి పౌరుడు ముందుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు...జీవితమే ముద్దు అంటూ విద్యార్థులతో నినాదాలు చేయించారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. తల్లిదండ్రులు మంచి మార్గంలో ముందుకు సాగడంతోనే భవిష్యత్తు బాగుంటుందని గుర్తుచేశారు. ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్‌సీ మునిక్రిష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.