
సర్పంచ్ సుభాషిణికి కన్నీటి వీడ్కోలు
తిరుపతి రూరల్ : మండలలోని చెర్లోపల్లె పంచాయతీని అద్భుతంగా తీర్చిదిద్ది ఉత్తమ సర్పంచ్‌గా కేంద్ర ప్రభుత్వం నుంచి శక్తి పంచాయత్ నేత్రి అభియాన్ పురస్కారం పొందిన బొల్లినేని సుభాషిణికి బుధవారం పలు పార్టీల నేతలు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. వివరాలు.. తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మహిళా సర్పంచ్‌ల శిక్షణలో చురుగ్గా పాల్గొన్న సుభాషిని మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే సృహ తప్పి కిందపడిపోయారు. కుటుంబీకులు వెంటనే తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు ఆమె సహకరించకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సర్పంచ్ సుభాషిణి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె భర్త బొల్లినేని శుభగిరి నాయుడు కన్నీటి పర్యంతమై కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు రాత్రంతా అక్కడే చికిత్స చేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న శుభగిరికి కుటుంబీకులు ధైర్యం చెప్పారు. సుభాషిణి మృత దేహానికి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, వైస్ ఎంపీపీలు యశోద, మాధవరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మునీశ్వరరెడ్డి నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు చెర్లోపల్లె శ్మశాన వాటికలో సుభాషిణి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

సర్పంచ్ సుభాషిణికి కన్నీటి వీడ్కోలు