
హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివురాలిలా ఉన్నాయి. హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్తె ఇషిక (29) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రముఖ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తోంది.
జూన్ చివరి వారంలో నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఆమె అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం గదిలో నుంచి బయటికి రాకపోవడంతో తల్లి రాత్రి 7 గంటల ప్రాంతంలో బెడ్‌రూమ్ వద్దకు వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించింది. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.