
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు
శాఖలవారీగా పోస్టుల మంజూరు,వర్కింగ్, వేకెంట్, డిమాండ్‌పై విశ్లేషణ
మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలోఇప్పటికే కమిటీ ఏర్పాటు
సరిపడా పోస్టుల్లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులున్న శాఖల సమతౌల్యానికి సిఫార్సు!
ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లోని గణాంకాల ఆధారంగా పరిశీలన
శాఖలవారీగా కార్యదర్శులు,హెచ్‌ఓడీలతో కమిటీ సమాలోచనలు
ఈ నెలాఖరుకల్లా సమీక్షలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక.. నివేదికను పరిశీలించాకే కొత్త జాబ్ కేలండర్ ఖరారు!
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో కేడర్‌వారీగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్, సెలవులపై వెళ్లిన ఉద్యోగులు.. ఇలా వివిధ కోణాల్లో రాష్ట్ర సర్కారు సమగ్ర సమీక్ష చేపట్టనుంది. ప్రధానంగా పనిభారానికి తగినట్లుగా పోస్టులున్నాయా? లేనట్లయితే డిమాండ్ ఎలా ఉంది? అనే అంశాల ప్రాతిపదికన సమీక్ష నిర్వహించనుంది. ఇందుకోసం మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో గత నెలలో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. శాఖలవారీగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతోపాటు శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహించాలని కమిటీని ఆదేశించింది.
కమిటీకి స్పష్టమైన సమాచారాన్ని అందించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్ని విభాగాల హెచ్‌ఓడీలకు గత వారం సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా సమీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్ సైతం ఈ నివేదికపైనే ఆధారపడనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డిమాండ్ అండ్ సప్లై తరహాలో...
ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో ఉద్యోగుల పాత్రే అత్యంత కీలకం. ప్రతి కార్యక్రమం సజావుగా జరగాలంటే డిమాండ్‌కు తగ్గట్లు పోస్టులు మంజూరు చేయాలి. ఒకవేళ ఖాళీలుంటే వెంటనే భర్తీ చేయాలి. ప్రస్తుతం కొన్ని శాఖల్లో డిమాండ్‌కు సరిపడా ఉద్యోగులు లేరు. దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటోంది. ఉదాహరణకు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా 11 ఆర్థిక సహకార సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినా ఉద్యోగుల పోస్టులు మంజూరు చేయలేదు.
దీంతో ఆయా విభాగాల్లో కార్యక్రమాల అమలు గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేలా డిమాండ్‌కు సరిపడా కొలువులు నిర్దేశించేందుకు వ్యూహాత్మక కార్యాచరణను సర్కారు రూపొందిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిమాండ్‌కు సరిపడా పోస్టులు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులున్న శాఖలను గుర్తించి వాటిని సమతౌల్యం చేసేలా కమిటీ సూచనలు చేసే అవకాశం ఉంది.
కమిటీ పరిశీలించనున్న అంశాలు...
⇒ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్‌ఎంఐఎస్) ఆధారంగా ప్రతి విభాగంలో మంజూరైన శాశ్వత, తాత్కాలిక పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలు.
⇒ ప్రభుత్వం అనుమతించిన డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు, భర్తీ కోసం గుర్తించిన పోస్టులు, నియామకాలు పూర్తి చేసిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగుల సంఖ్య.
⇒ శాశ్వత ప్రాదిపదికన ఉద్యోగాలు భర్తీ చేశాక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వారి తొలగింపు వివరాలు.
⇒ ప్రభుత్వ శాఖల్లో డిమాండ్‌కు తగినట్లు అదనపు పోస్టుల ప్రతిపాదనలు, కొత్తగా ప్రతిపాదించిన పోస్టుల నియామకాల వల్ల పడే ఆర్థికభారం అంచనా.
⇒ ఆర్థిక భారం తగ్గించుకోవడానికి గతంలో పోస్టులు మంజూరు చేసి పెండింగ్‌లో పెట్టిన పోస్టుల సమాచారం.
⇒ ప్రభుత్వ శాఖల్లో అనుమతి లేకుండా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు.
త్వరలో నూతన జాబ్ కేలండర్
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన జాబ్ కేలండర్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ముమ్మరం చేసింది. గతేడాది విడుదల చేసిన జాబ్ కేలండర్‌కు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రతిబంధకంగా మారడంతో అమలు సాధ్యపడలేదు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కొలిక్కి రావడంతో నూతన జాబ్ కేలండర్ జారీ అవసరమైంది. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పరిశీలనకు నిర్దేశించిన కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా కొత్త ఉద్యోగాల గుర్తింపుపై స్పష్టత రానుంది. ఆ తర్వాత ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించాక నూతన జాబ్ కేలండర్ ఖరారు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.