సహాయక చర్యలేం చేపట్టారు..? | Telangana High Court Questions State Government Over Recent Floods | Sakshi
Sakshi News home page

Telangana Floods: సహాయక చర్యలేం చేపట్టారు..?

Aug 2 2023 2:07 AM | Updated on Aug 2 2023 3:23 PM

Telangana High Court Questions State Government Over Recent Floods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివా­రణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై, అలాగే భవిష్యత్‌లో వరదలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభు­త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్‌ (ఐఏ) దాఖలైంది.

ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ‘వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలి. వాతారణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా భవిష్యత్‌ చర్యలు చేపట్టాలి. బాధితులను గుర్తించి పునరావాసం సహా ఇతర సహాయక చర్యలు చేపట్టాలి. బాధితుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి..’ అని సూచించింది.

ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
‘కేటాయించిన రూ.500 కోట్లు ఎలా పంపిణీ చేస్తారు? కడెం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? వర్షాలు, వరదలపై కేంద్రం ఎప్పుడు హెచ్చరించింది? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సహాయక చర్యలు ప్రారంభించింది?..’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ‘గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యల గురించి కూడా నివేదించాలి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రాంతవాసులు విషయంలో తీసుకున్న చర్యలు వివరించాలి. గోదావరి పరీవాహక జిల్లాల్లో ఏం సహాయక చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వరద బాధితులకు కనీస సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలు వివరించాలి.

వరద బాధిత కుటుంబాల్లోని వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఆహారం, వసతి వంటి ఏర్పాట్లు ఏం చేశారో చెప్పాలి..’ అని ఆదేశించింది. ఈ మేరకు ఒక అఫిడవిట్‌ దాఖలు చేయాలని, భవిష్యత్‌ వరదలు దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ముందస్తు నిర్దిష్టమైన శాశ్వత ప్రణాళికపై మరో అఫిడవిట్‌ దాఖలు సూచించింది. జనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదిక స్పందించాలని హితవు పలికింది. తాము అవసరమైతే గ్రామాల వారీగా కూడా పరిశీలన చేసి విచారణ చేస్తామని చెప్పింది. తదుపరి విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది.

నివేదికకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు
పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ‘క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు, ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికకు పొంతన లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం నివేదిక అందజేసినట్లు ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో విపత్తు ప్రమాదం పొంచి ఉందని గత నెల 19న కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం 28వ తేదీ వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు.

ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోని కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది..’ అని కోర్టుకు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పోరంచలో ఐదుగురు చనిపోతే నివేదికలో కనీస ప్రస్తావన లేదని అన్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోకపోవడంతో వరద నీరు ప్రాజెక్టు పైనుంచి పారిందని, ఒకవేళ ప్రాజెక్టు తెగితే దిగువనున్న 178 గ్రామాల్లోని ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 

రూ.500 కోట్లు కేటాయించాం..
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పరిషద్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సేవల్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. బాధితుల కోసం అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రూ.500 కోట్లు కేటాయించాం. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలను నివేదిస్తాం’ అని పేర్కొన్నారు.  

భారీ వర్షాలతో తీరని నష్టం
ప్రభుత్వ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయి. భూములు ముంపునకు గురికావడంతో 57,088 మంది రైతులు నష్టపోయారు. సోయాబీన్, చెరుకు, కందులు, మినుములు వంటి పంటలు నీటమునిగాయి. 190 నీటిపారుదల చెరువులకు గండ్లు పడ్డాయి. 168 రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement