
విద్యార్థినికి అవార్డు అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో కేసీ వేణుగోపాల్
యువత వారి భవిష్యత్తు కోసం పోరాడాలి
2029 రాహుల్ ప్రధానినామ సంవత్సరం కావాలి
వచ్చే ఏడాది జరిగే కేరళ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి
కేరళలో ఎంపీ కేసీ వేణుగోపాల్ ‘మెరిట్ అవార్డ్–2025’లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలోని యువత హక్కులను బీజేపీ కొల్లగొడుతోంది. యువత హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది. మీరే మా నమ్మకం. యువకులే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లు. మీ భవిష్యత్తుతోపాటు దేశం కోసం పోరాడండి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా తమ పార్టీ ఆగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఉద్యమం జరుగుతోందన్నారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడేందుకు.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరారు.
కేరళలోని అలెప్పి పట్టణంలో కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ ఆదివారం నిర్వహించిన ‘ఎంపీ మెరిట్ అవార్డ్–2025’కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రతిభావంతులైన టెన్త్, ప్లస్ టూ విద్యార్థులు, యువతకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ యువతలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతోపాటు వారిలో స్ఫూర్తి నింపేందుకు ఈ అవార్డులు ఎంతో దోహదపడతాయన్నారు. 100 శాతం ఫలితాలు సాధించిన 150 పాఠశాలల్లోని 3,500 మంది విద్యార్థులకు అవార్డులు అందించడం అభినందనీయమన్నారు.
దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని.. 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కేరళలో అమలవుతున్న వయోజన విద్యా కార్యక్రమం కూడా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతోందని చెప్పారు. విద్యకున్న ప్రాధాన్యత గురించి తెలంగాణ సమాజానికి కూడా తాను ప్రతి సందర్భంలో చెప్పడమే కాకుండా తెలంగాణలో విద్యాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని వివరించారు. తెలంగాణలోని పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామని చెప్పారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్న కేరళపట్ల తనకు ఒకింత అసూయ కలుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు.
21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు?
దేశంలోని యువత వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్ కోరారు. ‘చిన్న వయసులోనే యువత సివిల్స్‌కు ఎంపికై ఐఏఎస్‌లుగా జిల్లా పాలనా వ్యవస్థను సమర్థంగా నడుపుతున్నప్పుడు 21 ఏళ్లకే యువత ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదు? ఆ దిశగా రాజ్యాంగాన్ని సవరించుకోవాలి. దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 ఏళ్లకు ఓటు హక్కు ఉండేది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా దాన్ని 18 ఏళ్లకు తగ్గించారు. కానీ ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కనీస వయసు 25 ఏళ్లుగానే ఉంది. ఇకనైనా యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది’అని రేవంత్ అభిప్రాయపడ్డారు.
2029లో లోక్‌సభ ఎన్నికలు రెండు ప్రధాన శక్తుల మధ్య జరగబోతున్నాయని.. యువత ఈ అంశాన్ని గ్రహించాలని కోరారు. వచ్చే ఏడాది జరిగే కేరళ ఎన్నికలను 2029లో దేశ భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలుగా రేవంత్ అభివరి్ణంచారు. 2029లో రాహుల్ గాం«దీని ప్రధానిని చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లాలని.. ఆ ఏడాదిని రాహుల్ ప్రధానినామ సంవత్సరంగా అందరికీ చాటాలని చెప్పారు. యువతను ప్రోత్సహించేందుకు కేసీ వేణుగోపాల్ చూపుతున్న చొరవను ప్రతి రాష్ట్రంలో, ప్రతి నియోజకవర్గంలో స్ఫూర్తిగా తీసుకొని నాయకులు ముందుకెళ్లాలని రేవంత్ కోరారు.