
సాక్షి,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్.. ఓటర్ జాబితాలో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చే ఓటర్ జాబితా ముసాయిదాను గ్రామస్థాయిలోనే పరిశీలించి అభ్యంతరాలను అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్లాలని సూచించారు. ఓటర్ జాబితాలో అక్రమాలు,అవకతవకలు జరిగితే కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీలు ఎల్.రమణ, డా.దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ ఇంఛార్జ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.