
ఫుడ్ పాయిజన్ సమస్యకు ఇదే పరిష్కారమన్న హైకోర్టు
వారు నాణ్యతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారని వ్యాఖ్య
విద్యార్థులు స్కూల్ పనుల్లో భాగస్వాములైతే తప్పేంటి? అని ప్రశ్న
తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో పనులు చేశానన్న సీజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు అక్కడే భోజనం చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఫుడ్ పాయిజన్ (కలుషితాహారం) ఘటనల సమస్యను ఇది పరిష్కరిస్తుందని అభిప్రాయపడింది. నాణ్యతపై వారు ఎప్పటికప్పడు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రతీ స్కూల్ విద్యార్థికి ఎంత మొత్తంలో ఆహారం ఇస్తారు? ఏమేమి ఇస్తారు? ఎలా అందిస్తారు? న్యూట్రిషన్ ఎలా లెక్కిస్తారు?.. ఇలా పూర్తి వివరాలతో స్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించింది.
శ్రమను గౌరవించే గుణం అలవడాలంటే ముందు కష్టం తెలియాలని.. విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వామ్యమైతే తప్పేంటని ప్రశ్నించింది. చిన్నతనం నుంచే వారికి తమ పనులు తాము చేసుకోవడం అలవాటు చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించిన వివరాలు సమర్పించేలా సర్కార్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్ ధర్మాసనం తాజాగా బుధవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు..
పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినించారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే సౌకర్యాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. చట్టప్రకారం స్వచ్ఛమైన పౌష్టికాహారం అందించాలి. కానీ ప్రభుత్వం సరిగా అమలు చేయని కారణంగా విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురువుతున్నారు.
ఇదే హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా, ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినా.. ఆహార కల్తీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రిన్సిపాల్ లేదా వార్డెన్.. రోజూ కిచెన్, స్టోర్ రూమ్ తనిఖీలు చేయాలి. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలి. ఆ తర్వాతే విద్యార్థులకు వడ్డించేందుకు అనుమతించాలి. కానీ ఇది జరగడం లేదు..’అని చెప్పారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం..
అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘ఫుడ్ పాయిజన్ కారణంగా ఎవరూ చనిపోలేదు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చగా, మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఇలాంటి ఘటనల్లో బాధ్యులైన, నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం, టిఫిన్ అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. మధ్యాహ్న భోజన నిర్వహణపై కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఓ సభ్యుడు ఉన్నారు..’అని నివేదించారు.
వ్యక్తిగతంగా ఎవరి పనైనా చేస్తేనే తప్పు
సీజే జోక్యం చేసుకుని.. రోజూ పిల్లలతో టీచర్ కూడా కలిసి అక్కడే భోజనం చేసే ప్రక్రియ చేపడితే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థులు పని చేయడం తప్పుకాదని, వ్యక్తిగతంగా ఎవరి పనులైనా చేస్తే మాత్రమే తప్పుబట్టాలన్నారు. తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో పనులు చేశానని గుర్తు చేసుకున్నారు.