కాళేశ్వరం నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే! | Ghose Commission report on Kaleshwaram: Telangana | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం నిర్ణయాలన్నీ కేసీఆర్‌వే!

Sep 1 2025 1:06 AM | Updated on Sep 1 2025 1:06 AM

Ghose Commission report on Kaleshwaram: Telangana

ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకునే స్వేచ్ఛ సర్కారుకు ఉంది

రాజకీయ కార్యనిర్వాహకుడిగా కాకుండా పాలనాఅధికారిగా వ్యవహరించారు 

మంత్రివర్గ ఆమోదం లేకుండానే బరాజ్‌ల నిర్మాణానికి అనుమతులు 

దురుద్దేశంతో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు

నీటి నిల్వకు వాడడంతోనే బరాజ్‌ల వైఫల్యం  

జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికలో స్పష్టికరణ.. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సర్కారు

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రీఇంజనీరింగ్‌ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని, అందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలని తీసుకున్న నిర్ణయం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరిదేనని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ తేల్చి చెప్పింది. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఆయనదే. ప్రాజెక్టు అంకురార్పణ దశ నుంచి ప్రతి నిర్ణయాన్ని ఆయనే స్వయంగా తీసుకున్నారు.

డీపీఆర్‌ల తయారీ వ్యాప్కోస్‌కు అప్పగింత, తుది డీపీఆర్‌ అందకముందే అంచనాలను తయారు చేసి ఆమోదించడం, బరాజ్‌లలో నీరు నిల్వ చేయాలని ఆదేశించడం, కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించేలా నిబంధనలు మార్చాలని ఆదేశించడం వెనక ఆయన నిర్ణయాలే ఉన్నాయి. మూడు బరాజ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు, నిర్మాణం, నిర్వహణలో నాటి సీఎం సూక్ష్మంగా భాగస్వాములయ్యారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ లొకేషన్‌ మార్చాలనే నిర్ణయం ఆయనదే.

రాజకీయ కార్యనిర్వాహకుడిగా వ్యవహరించాల్సిన నాటి సీఎం.. పాలనాఅధికారిగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఆయనపై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ సర్కారుకు ఉంది’అని కమిషన్‌ సిఫారసు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను ఆదివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నివేదిక 665 పేజీలతో 3 సంపుటిలుగా ఉంది. నాటి ఆర్థిక మంత్రి (ఈటల) తన బాధ్యతలను ఆదమరిచి నాటి సీఎం కోరికలు తీర్చుకునేందుకు సహకరించారని తప్పుబట్టింది.  

నివేదికలోని ముఖ్యాంశాలు
మంత్రివర్గ ఆమోదం లేకుండానే : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి 2016, మార్చి 1న మూడు జీవోలు (నెం.231, 232, 233) జారీ చేశారు. ఆ తర్వాతి దశలోనూ మంత్రివర్గం నుంచి ర్యాటిఫికేషన్‌ పొందలేదు. నాటి సీఎం(కేసీఆర్‌), మాజీ నీటిపారుదల మంత్రి (హరీశ్‌) మాత్రమే ఆమో దించారు. ప్రభుత్వ బిజి నెస్‌ రూల్స్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ పరిపాలనపర అనుమతుల జారీ చేశారు.  

టర్న్‌ కీ విధానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని వ్యాప్కోస్‌ చేసిన సిఫారసులను కాళేశ్వరం ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (కైఐపీసీఎల్‌) విస్మరించింది. ప్రాజెక్టు రూపకల్పన, మదింపు, ఆమోదించడం, నిధుల విడుదల, అమలు బాధ్యత, నిర్వహణ, పర్యవేక్షణ, మూల్యాంకనానికి కేఐపీసీఎల్‌ను ఏర్పాటు చేయగా, ఈ ప్రక్రియల్లో కేఐపీసీఎల్‌ను ప్రభుత్వం భాగస్వామ్యం చేయలేదు. కేవలం నిధుల సేకరణ, బ్యాంకులు, ఆర్థిక సంస్థ నుంచి రుణాల సమీకరణ, నిర్మాణ సంస్థలకు బిల్లుల చెల్లింపులకే కేఐపీసీఎల్‌ను సర్కారు పరిమితం చేసింది.  

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు అనేక మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చారని నీటిపారు దల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి చెప్పారు. నాటి సీఎం అధ్యక్షతన నిపుణులతో నిర్వహించిన చాలా సమావేశాల్లో కట్టడాల రకం, వాటి సామర్థ్యం, లొకేషన్, ప్లాన్‌ అలైన్‌మెంట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి గూగు ల్‌ మ్యాప్‌లను విస్తృతంగా వినియోగించారు. ‘2015, ఫిబ్రవరి 4న మహారాష్ట్ర, ఏపీతో జరిగిన భేటీలో తమ్మిడిహెట్టి బరాజ్‌ ఎత్తు తగ్గించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. 2016, ఆగస్టు 23న జరిగిన భేటీలో.. మేడిగడ్డ బరాజ్‌ ఎత్తు పెంపుపై వాస్తవ ముంపు మేరకు అంత్రరాష్ట్ర బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్ణయించారు. 

2016, మార్చి 1న మూడు బరాజ్‌ల నిర్మాణానికి జీవోలు జారీ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌ల నిర్మాణానికి హైపవర్‌ కమిటీ సిఫార్సు చేయలేదు.  

తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ వద్ద బరాజ్‌ల నిర్మాణంతో లాభనష్టాలను నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మాణం సరికాదని, ఆర్థికంగా ప్రయోజనకరం కాదని సూచించింది. ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద నిర్మాణం చేపట్టాలని ప్రత్యామ్నాయం చూపింది. ఈ నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా, కోల్డ్‌ స్టోరేజీలో పెట్టింది. ఇది ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. 

2016, మార్చి 7న జీవో నంబర్‌ 655 ప్రకారం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లకు ప్రతిపాదించలేదు. 
2015, ఏప్రిల్‌ 13న మేడిగడ్డ నుంచి మిడ్‌ మానేర్‌ వరకు డీపీఆర్‌ రూపొందించే బాధ్యతను వాప్కోస్‌కు అప్పగిస్తూ రూ.5.94కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేశారు. ఈ నోట్‌ ఫైల్‌ను నాటి సీఎం, నీటి పారుదల మంత్రి ఆమోదించారు. అదే ఏడాది జూన్‌ 3న దీన్ని కేబినెట్‌ ఆమోదించింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే 2016 జనవరిలో అంచనాలను రూ.6.77 కోట్ల పెంచారు.  

ఎల్లంపల్లి–మేడిగడ్డ మధ్య రెండు బరాజ్‌ల నిర్మాణానికి డీపీఆర్‌ తయారీ కోసం 2016 మార్చిలో రూ.12.96 కోట్లతో వ్యాప్కోస్‌కు పనులు అప్పగి స్తూ పరిపాలన అనుమతులిచ్చారు. వాప్కోస్‌ డీపీఆర్‌ సమర్పించిందా? లేదా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. 
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు, 3 విద్యుత్‌ కేంద్రాలకు సంబంధించి డీపీఆర్‌లోని కొంత భాగాన్ని జనవరి, 2016లో.. మార్చి 27న తుది డీపీఆర్‌ సమర్పించింది.  

అనుమతులు జారీ చేసి తర్వాతి జూలై/ఆగస్టు నెలల్లో కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. 2017 ఫిబ్రవరిలో డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి పంపించారు.  
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు నీటిలభ్యతపై 2015 లో, కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత విషయంలో 2017లో సీడబ్ల్యూసీ రాసిన లేఖల్లో అంశాలు ఒకే లా ఉన్నాయి. 2015లో సీడబ్ల్యూసీ రాసిన లేఖ ఆధారంగా తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మాణం సాధ్యం కాదని భావనకు వస్తే.. 2017లో రాసిన లేఖ ఆధారంగా మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణం సైతం సాధ్యం కాదు. 

2018, మే 1 నాటికి సీడబ్ల్యూసీ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక వ్యయాన్ని ఆమోదించకుండా అధ్యయనం జరుపుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2018, మార్చిలో ప్రాజెక్టు అంచనాలను రూ.30,623.72 కోట్ల నుంచి రూ.80,190.46 కోట్లకు పెంచేసింది.  
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందే సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌తో అధ్యయనం జరిపించాల్సి ఉండగా, పనులు తు దిదశలో ఉన్నప్పుడు జరపాల్సిన అవసరం లేదని ఈ విభాగ డైరెక్టర్‌ 2018, మే 21న లేఖ రాశారు.  

సీడబ్ల్యూసీ నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే, ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలనకు దర ఖాస్తు చేసుకోకుండానే 2016, మార్చి 1న పరిపాలన అనుమతులు మంజూరు చేయడమే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  
సవరించిన పరిపాలన అనుమతులపై సీఎం, మంత్రి ముందు నోట్‌ఫైల్‌ ఉంచడానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ 2018, మే 19న ఆమోదం తెలిపారు. అత్యవసర దృష్ట్యా ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. అదే నెల 27న కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ ముందస్తు ఆమోదం లేకుండా అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడ్డారు.

నిర్దేశిత గడువుతో పోల్చితే మేడగడ్డ నిర్మాణానికి 6 రెట్లు, అన్నారానికి 5 రెట్లు, సుందిళ్లకు 8 రెట్లు సమయం ఇచ్చారు. సైట్‌ అప్పగింత, డిజైన్ల కారణంగానే ఆలస్యం జరిగిందని కాంట్రాక్ట్‌ సంస్థల వాదనకు అధికారులు అంగీకారం తెలిపారు. ఒప్పందంలోని క్లాజ్‌ 26, 31లను అధికారులు ఉల్లంఘించారు. ఆలస్యమైనా ఎలాంటి జరిమానా విధించలేదు. 2017, మార్చి వరకు నిర్మాణ స్థలాన్ని అప్పగించలేదు.  
ఫీల్డ్‌ అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టకుండానే బ రాజ్‌ల డిజైన్లను సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ త యారు చేసింది. డిజైన్ల తయారీకి ముందు కనీసం 3డీ, 2డీ మోడల్‌ స్టడీస్‌ కూడా నిర్వహించలేదు.  

బరాజ్‌ల పేరుతో నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు/డ్యామ్స్‌గా నిర్మించారు. నీటిని మళ్లించేందుకు విని యోగించే బరాజ్‌లను నీటిని నిల్వ చేసే అవసరాలకు వాడినట్టు అధికారులు అంగీకరించారు. కాని వాటిని రిజర్వాయర్లు/డ్యామ్‌లుగా డిజైన్‌ చేయలేదు. ఈ కారణంతోనే అవి విఫలమయ్యాయి.  
క్వాలిటీకి సంబంధించి కమిషన్‌కు సమర్పించిన రిజిస్టర్లు, పుస్తకాల్లో కొన్ని అదనంగా పేజీలు పిన్‌ చేయడం, కొన్ని టై చేయడం చేశారు. పేజీల సంఖ్య క్రమానుగుణంగానే లేదు.  

2019, ఆగస్టు 6న మేడిగడ్డ ‘కంప్లీషన్‌ సరి్టఫికెట్‌’ జారీ చేయమని ఏజెన్సీ కోరడం..సరి్టఫికెట్‌ అధికారులు జారీ చేయడం తప్పు. బాధ్యతాలోపం కా లాన్ని ఏజెన్సీ తప్పుగా ప్రస్తావించింది. ఒప్పందం ముగిసిపోయినట్టు ఎలాంటి సరి్టఫికెట్‌ జారీ కానందున మేడిగడ్డ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కానట్టే లెక్క. దీని కారణంగా లోపాలకు బాధ్యతాకాలం, ఆపరేషన్, నిర్వహణ కాలం నిర్ధారించలేదు.  
అధికారులు, ఏజెన్సీలు ఒకరితో ఒకరు కుమ్మక్కై దురుద్దేశంతో చెడు మార్గంలో అక్రమ లబ్ధి పొందేందుకు పనిచేశారు. తద్వారా మేడిగడ్డ నిర్మాణానికి ప్రజాధనం భారీగా ఖర్చు చేశారు. 

డీపీఆర్‌ తయారీని వాప్కోస్‌కు అప్పగిస్తూ జీవో జారీకి సంబంధించి నోట్‌ఫైల్‌పై నీటి పారుదల మంత్రి , ముఖ్యమంత్రి సంతకాలున్నాయి. జీవో జారీ చేసిన తర్వాత కేబినెట్‌ ఆమోదించింది.  
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు పరిపాలన అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా, నోట్‌ ఫైల్‌పై వీరి సంతకాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థికమంత్రి సంతకం లేదు.  
పరిపాలన అనుమతి (2016, మార్చి 1) తర్వాతే కేబినెట్‌ సబ్‌ కమిటీ (2016, మార్చి 15) ఏర్పాటైంది. 3సార్లు భేటీ అయ్యి నివేదిక అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement