
జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్
నవంబర్ 6 నుంచి 11 వరకు ఆదేశాలు అమలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ, ప్రచారం నవంబర్ 6 నుంచి 11 వరకు నిషేధిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వెల్లడించారు. ఈ నెల 13న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదు, ప్రచురించరాదు, ఎలాంటి మాధ్యమంలోనూ ప్రచారం చేయరాదని పేర్కొన్నారు. ఈ నిషేధం టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుంది.
ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి ప్రజాప్రతినిధుల చట్టం, 1951లోని 126ఏ సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అలాగే, పోలింగ్ ముగిసే ముందు 48 గంటల వ్యవధిలో ఎటువంటి ఎన్నికల సంబంధిత విషయాలు, సర్వేలు, అభిప్రాయ సేకరణ ఫలితాలు ఎలక్ట్రానిక్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో ప్రదర్శించరాదు. మీడియా సంస్థలు, రాజకీయ పారీ్టలు, సోషల్ మీడియా వినియోగదారులు, ఎన్నికల సంబంధిత అన్ని వర్గాలు ఈ మార్గదర్శకాలను కచి్చతంగా పాటించాలని, స్వేచ్ఛా, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణలో భాగస్వాములుగా నిలవాలని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విజ్ఞప్తి చేశారు.