
రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఓయూ వీసీ ప్రొ.కుమార్. చిత్రంలో మంత్రులు పొన్నం, అడ్లూరి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లో నిర్మించిన కొత్త హాస్టల్ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలసి 21వ తేదీన ప్రారంబోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహా్వనించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓయూలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను ప్రారంభించడంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న మరో రెండు కొత్త హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులను సైతం సీఎం ప్రారంభించనున్నారు.
అనంతరం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’అనే అంశంపై ముఖ్యమంత్రి.. ప్రొఫెసర్లు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, గత ఇరవై ఏళ్ల కాలంలో ఓయూకు ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగించడం ఇదే ప్రథమమని వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘సీఎం రీసెర్చ్ ఫెలో షిప్’తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని వీసీ తెలిపారు.