
పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు
రక్షణకు రంగంలోకి దిగనున్న సీఐఎస్‌ఎఫ్
భారీ రిక్రూట్‌మెంట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులపై ముప్పేట దాడితో విరుచుకుపడుతోన్న కేంద్ర ప్రభుత్వం వారి కట్టడికి చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్రం.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు రక్షణ కల్పించేందుకు ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసింది. సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్‌ఎఫ్)లో కొత్త రక్తం నింపేందుకు భారీగా రిక్రూట్‌మెంట్లు చేపట్టనుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నూతన పారిశ్రామిక పాలసీని ప్రకటించింది. ఈ క్రమంలో ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు భద్రత కల్పిస్తామని చెబుతున్న కేంద్రం పెట్టుబడులకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెబుతోంది. అందులో భాగంగా ప్రత్యేక బలగాల స్థానంలో సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్‌ఎఫ్)ను రంగంలోకి దించుతోంది.
సీఐఎస్‌ఎఫ్‌పై సీలింగ్ ఎత్తివేత..
ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న జవాన్ల సంఖ్య 1.25 లక్షలకు అటూఇటుగా ఉంది. పహల్గాం ఘటన తర్వాత కొత్తగా 13వేల మందిని చేర్చుకోగా మరో 24వేల మంది నియామక ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉంది. సీఐఎస్‌ఎఫ్‌కు సంబంధించి 1.62 లక్షల పోస్టుల వరకే సీలింగ్ ఉంది. తాజాగా బస్తర్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు దీన్ని జూలై 22న కేంద్రం సవరించింది. మొత్తంగా 2.20 లక్షల మంది కానిస్టేబుళ్లు/జవాన్లను నియామకానికి సీఐఎస్‌ఎఫ్‌కు అవకాశం కల్పించింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో ఏటా 14వేల మందికి మించకుండా మొత్తం 58 వేల మంది సీఐఎస్‌ఎఫ్ జవాన్లు బస్తర్ అడవుల్లో అడుగుపెట్టనున్నారు.
ఇప్పటికే ఇక్కడ పారిశ్రామిక పురోగతి, ఖనిజాల రవాణా కోసం మల్కాన్‌గిరి–భద్రాచలం రైల్వే మార్గానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, చాన్నాళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన కొత్తగూడెం–కిరండోల్ రైలు మార్గం ఫైనల్ లోకేషన్ సర్వేకూ పచ్చా జెండా ఊపింది. అంతేకాక కిరండోల్–బీజాపూర్–రామగుండం వరకు కొత్త మార్గానికి సర్వే చేపడుతోంది. వీటికి రక్షణతో మొదలయ్యే సీఐఎస్‌ఎఫ్ విధులు ఆ తర్వాత రాబోయే పరిశ్రమలకూ భద్రత కల్పించనున్నాయి.