
పార్టీ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కీలక భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక పోరుపై దిశానిర్దేశం
జిల్లా నేతలతో కేటీఆర్,హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్
బతుకమ్మ ద్వారా సర్కారును ఎండగట్టాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఎర్రవల్లి నివాసంలో గురువారం జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కేడర్‌తో జరుగుతున్న సమావేశాల వివరాలను కేటీఆర్ వివరించారు. పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఓటర్‌ను చేరుకునేలా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తు పెంపుతో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగే నష్టం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
బనకచర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రానికి జరిగే నష్టంపై బీఆర్‌ఎస్ పోరాడక తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సీబీఐ ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించిందనే వార్తల నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట వాదన వినిపించిన తరహాలోనే ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.
స్థానిక ఎన్నికలపై టెలి కాన్ఫరెన్స్
రేపోమాపో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత మొదలుకుని బతుకమ్మ పండుగ ఏర్పాట్ల వరకు ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఊరూరా పార్టీ ఆధ్వ ర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు.