
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం ఏదైనా ఉందంటే అది సినిమానే. అయితే ఇదే సినిమా కారణంగా ప్రజలు నాటకానికి, పుస్తక పఠనానికి, తెలుగు భాష అభివృద్ధికి దూరమయ్యారన్న అపవాదూ ఉంది. ఇందులో నిజానిజాల మాటెలా ఉన్నా... నాటకం మాత్రం తన ఉనికిని చాటుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ అంశాలపైనే ప్రముఖ నాటక రంగ కళాకారిణి, పుస్తక రచయిత ‘దేవిక దాస్’ తన అంతరంగాన్ని పంచుకున్నారు. తాజా పుస్తకం ‘కలైడో స్కోప్’ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫెయిమ్ బిస్ట్రోలో జరిగిన కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు ఇలా....
ప్రశ్న: మీ కొత్త పుస్తకం ‘కలైడో స్కోప్’ గురించి చెప్పండి. ప్రేరణ ఏమిటి?
దేవిక దాస్: ఆ పుస్తకం రంగుల గురించి.. కళకు ఉన్న హీలింగ్ టచ్ గురించి! దేశంలోని అజ్ఞాత కళాకారులను పరిచయం చేసే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను. వీరు సొంత అనుభూతి కోసం కళను ప్రాక్టీస్ చేస్తున్నవారు. జీవితంలో సమతౌల్యం సాధించేందుకు కళ ఎలా ఉపయోగపడుతుందన్న విషయాలను కూడా ప్రస్తావించాను. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 10 మంది చిత్రకారుల కళానైపుణ్యంతోపాటు వారి దృష్టికోణంలో కళ అంటే ఏమిటన్న విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచాను.
ప్రశ్న: మీరు నాటక రంగం నుంచి వచ్చారు. హైదరాబాద్‌లో నాటకరంగం ఎలా ఉందనుకుంటున్నారు?
దేవిక: అంత గొప్ప మన్ననలైతే పొందడం లేదంటాను. సురభి, నిశుంభిత, సూత్రధార్ వంటి గ్రూపులు వేటికవే పనిచేస్తున్నాయి కలిసికట్టుగా చేస్తోంది కొంతే. పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఆయా ప్రాంతాల వారు ఆయా ప్రాంతాల్లోని నాటకాలకు పరిమితమైపోతున్నారు. సైబరాబాద్ ప్రేక్షకులు రంగభూమికి వెళతారు... హైదరాబాద్ వారు లా మకాన్‌కు వెళుతూంటారు. వాళ్లు ఇటు రారు.. వీళ్లు అటు వెళ్లరు.
ప్రశ్న: మరి.. నాటక ప్రియులందరినీ ఏకం చేసేందుకు ఏం చేయాలంటారు?
దేవిక: కళను అభినందించే వారు చాలామందే ఉన్నారు. కానీ నాటకానికి ప్రాయోజకత్వం వహించేవారు తక్కువైపోతున్నారు. కళారూపాలతో మీకు ఆనందం కలుగుతోందనుకుంటే అందుకు మద్దతుగా నిలబడాలి. కర్ణాటక, మహారాష్ట్రల్లో నాటకరంగానికి మంచి ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా నాటకాన్ని దాటేసి వెళ్లిపోయింది.
ప్రశ్న: నాటక రంగానికి వస్తున్న యువ కళాకారుల గురించి చెప్పండి?
దేవిక: ఎక్కువ మంది నాటక రంగాన్ని సినిమాల్లో నటించేందుకు ఒక మెట్టుగా చూస్తున్నారు. అందరూ హీరోలు, హీరోయిన్లు కావాలని అనుకుంటున్నారు కానీ.. కళను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. నాటకం అంటే కేవలం నటన మాత్రమే కాదు.. క్రమశిక్షణ నేర్పే ఈ రంగంలో సంగీతం, నృత్యం, సెట్ డిజైన్ వంటివి ఎన్నో ఉన్నాయి.
ప్రశ్న: ప్రజలు థియేటర్‌కు రావడం లేదు అంటున్నారు. మరి మీరే ప్రజల వద్దకు వెళ్లవచ్చు కదా?
దేవిక: ఆ ప్రయత్నమూ సాగుతోంది. చాలా సందర్భాల్లో మేము వీధి నాటకాలు వేస్తున్నాము. అయితే అన్నిసార్లూ ఇలాగే చేయడం కుదరదు. అందుకే ప్రజలు థియేటర్‌కు రావాలని ఆశిస్తున్నాము. సామాజిక అవగాహన పెంచేందుకు కానీ.. చైతన్యం కోసం కాని కొన్నిసార్లు థియేటరే బాగుంటుంది. ఇందుకు తగిన ప్రాయోజకత్వం లభిస్తే కళ పదికాలాలపాటు కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నాటకానికి మంచి ఆదరణే లభిస్తోందని చెప్పాలి.
గోపాల: కళ అనేది కళాకారుడి ఆత్మకు తృప్తి కలిగిస్తే సరిపోదు.. నాలుగు వేళ్లూ నోట్లకి వెళ్లాలి అంటారు. అంతేనా?
దేవిక: అవునూ. పూర్వం రాజుల ప్రాపకం కారణంగా కళాకారులు తమ కళపై దృష్టిపెట్టే వీలేర్పడింది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే కళలను ఆదరించే సమాజం కావాలని కోరుకుంటున్నాము. థియేటర్ గ్రూపులు కూడా కలిసి పనిచేయాలి. తెలంగాణలో థియేటర్ కోసం ఐక్యమత్యం ఉండాలన్నది నా ఆశ.
ఇదే కార్యక్రమంలో 24 ఏళ్ల మెలోనా జెస్సికా ‘జంక్ జర్నలింగ్’ను పరిచయం చేశారు.