
కాసేదాన్ కవులడా చిత్ర యూనిట్
రీమేక్ సమయంలో
తమిళసినిమా: 1972లో ఏవీఎం సంస్థ నిర్మించిన చిత్రం కాసేదాన్ కడవులడా. ముత్తురామన్ ,లక్ష్మీ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. కాగా అదే చిత్రాన్ని ఇప్పుడు దర్శకుడు ఆర్. కన్నన్ తన మసాలా ఫిక్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేశారు . ఇందులో మిర్చి శివ, నటి ప్రియాఆనంద్ హీరోహీరోయిన్లుగా నటించారు. యోగిబాబు, కరుణాకరన్, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి రాజ్ ప్రతాప్ సంగీతం అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత, నటుడు రాజన్ మాట్లాడుతూ దర్శకుడు కన్నన్ దివంగత దర్శక నిర్మాత రామనారాయణన్ మాదిరి వరుసగా చిత్రాలను చేస్తున్నారని, అయితే ఇకపై నిర్మాతగా చిత్రాలు చేయవద్దని తాను ఆయనకు చెప్పానని అన్నారు. కారణం చిత్ర నిర్మాణం లాంటి శిక్ష మరొకటి ఉండదన్నారు. కథలను నమ్మి చిత్రాలు చేయాలని, హీరోల కోసం కథలు తయారు చేస్తే కచ్చితంగా ప్లాప్ అవుతాయని చెప్పారు. క్లాసిక్ కథా చిత్రాలను రీమేక్ చే సేటప్పుడు కచ్చితంగా పోల్చకుంటారని తెలుసని, అందువల్ల భయం భయంగానే ఈ చిత్రాన్ని చేసినట్లు నటుడు శివ అన్నారు. అయితే గత చిత్రం కాసేదాన్ కవడులడా కంటే బాగా చేయలేమని, అయితే సాధ్యమైనంత వరకూ ఈ చిత్రాన్ని బాగా చేసే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్ మాట్లాడుతూ గత నెలలో తాను దర్శకత్వం వహించిన ది గ్రేట్ ఇండియన్ కిచ్చన్ చిత్రాన్ని విడుదల చేశామని, ఈ నెల కాసేదాన్ కడవులడా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుత సినిమా పరిస్థితుల్లో నెలకో చిత్రాన్ని విడుదల చేయడం సాధారణ విషయం కాదన్నారు. అందుకు తనకు పలువురు అండగా నిలుస్తున్నారని చెప్పారు. కాగా నటుడు మిర్చిశివ లేకపోతే ఈ చిత్రం లేదన్నారు. ఆయన తన చిరకాల మిత్రుడు అనీ, ఇప్పుటికీ ఇద్దరం కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఉళ్లల్తై అళ్లిత్తా, పంబల్ కె.సంబంధం చిత్రాల తరహాలో జాలీగా సాగే చిత్రం ఇదన్నారు.
