
సాక్షి, చైన్నె : ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయి. తమ తమ ప్రాంతాలలో నీటి అవశ్యకత, సంరక్షణ తదితర అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అయితే కడలూరు జిల్లా నైవేలి పరిధిలోని కత్తాలై, ముమ్ముడి చోళగం తదితర గ్రామాల్లో అయితే, ఎన్‌ఎల్‌ఎల్‌సీ విస్తరణకు వ్యతిరేకంగా గ్రామ సభల్లో తీర్మానాలు చేశారు. తమకు ఎన్‌ఎల్‌సీ కారణంగా నష్టాలు, కష్టాలు అధికంగా ఉంటాయని, తమకు ఆ విస్తరణ వద్దే వద్దని నినాదించారు. ఇక కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలోని గ్రామాలలో అయితే చైన్నెకు ప్రత్యామ్నాయంగా విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో వాదనలు వినిపించారు. ఇక, ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో నీటి ఆవశ్యకత, విలువ, పొదుపు, భవిష్యత్ దృష్ట్యా చేపట్టాల్సిన, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు.
గ్రామాల్లో రక్షిత మంచినీటి సదుపాయం
తిరువళ్లూరు: గ్రామాలకు రక్షిత మంచినీటి సదుపాయాన్ని వంద శాతం అమలు చేస్తామని కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్ స్పష్టం చేశారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలను నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంఆనే తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 పంచాయతీల్లోనూ సభలను నిర్వహించారు. విల్లివాక్కం యూనియన్‌లోని పాండేశ్వరం గ్రామంలో జరిగిన గ్రామసభకు కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్, సబ్‌కలెక్టర్ రిషబ్ హాజరయ్యారు. స్థానిక పంచాయతీ అధ్యక్షురాలు రేఖరాము ఆధ్వర్యంలో ఈ సభ సాగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్‌జీవన్ పథకం ద్వారా అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటి పథకాన్ని అందజేస్తామన్నారు. ఉపాధీహమీ కూలీల ఎంపికతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే సమయంలో అర్హులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల నుంచి వినతి పత్రాన్ని సైతం స్వీకరించారు. ఇదే విధంగా వెంగత్తూరులో సునితబాలయోగి, ఉలుందైలో రమేష్, తొడుగాడులో వెంకటేషన్, నేమంలో ప్రేమ్‌నాథ్ నేతృత్వంలో గ్రామసభలను నిర్వహించారు. గ్రామసభలో పలు అబివృద్ధి పనులతో పాటు, భవిష్యత్‌లో చేపటాల్సిన పనులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. కాగా గ్రామసభలో ఏర్పాటు చేసిన కూరగాయల ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించి రైతులను అభినందించారు.
పాండేశ్వరం గ్రామసభలో ప్రసంగిస్తున్న కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్, చిత్రంలో సబ్‌కలెక్టర్ రిషబ్
రైతులు సాగు చేసిన పంటలను పరిశీలిస్తున్న కలెక్టర్
– ఎన్‌ఎల్‌సీ, విమానాశ్రయానికి వ్యతిరేకంగా తీర్మానాలు
