
పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో ప్రసంగిస్తున్న స్టాలిన్
పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు వ్యవహరించ కూడదని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా ఇటీవల కొన్ని ఘటనలు చోటు చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది పొడవునా డీఎంకే దివంగత నేత కరుణానిధి శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని జిల్లా కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు.
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలోని కలైంజ్ఞర్ అరంగంలో బుధవారం ఆ పార్టీ జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నిర్వాహకుల సమావేశం నిర్వహించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకీ పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ముఖ్య నేతలు నెహ్రూ, టీఆర్‌బాలు, ఐ పెరియ స్వామి తదితరులు హాజరయ్యారు. డీఎంకే పార్టీ పరంగా ఉన్న అన్ని జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని చోట్ల నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
నేతలకు క్లాస్..
కొన్ని చోట్ల నాయకులు, కింది స్థాయి కేడర్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు అసహించుకునే విధంగా వ్యవహరించ వద్దని హెచ్చరించారు. కేడర్‌ను కట్టడి చేయాల్సిన బాధ్యత జిల్లాల కార్యదర్శులపై ఉందన్నారు. పార్టీ అఽధిష్టానాన్ని ధిక్కరించే విధంగా కొన్ని ఘటనలు జరుగుతున్నాయని పేర్కొంటూ, పరోక్షంగా తిరుచ్చిలో జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతే గానీ, పార్టీకిప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వేదికలు, సభలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అనాగరిక చర్యలు, అనాగరిక వ్యాఖ్యలు వద్దే వద్దంటూ నేతలు స్పష్టం చేసినట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం..
పార్టీ నాయకులు అందరూ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. బూత్‌కమిటీల ఏర్పాటు వేగ వంతం చేయాలని సూచించారు. త్వరలో నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను రంగంలోకి దించనున్నట్లు పేర్కొన్నారు. 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున పార్టీ స్థానిక నాయకులను నియమించి, వారికి ప్రభు త్వ ఫలాలు అందే విధంగా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే రీతిలో కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం రెండేళ్ల పాలన, తాజా బడ్జెట్ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లే రీతిలో సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఆదేశించారు. అలాగే పార్టీ బలోపేతం లక్ష్యంగా మరో కోటి మందిని కార్యకర్తలుగా చేర్చే కార్యక్రమాన్ని విస్తృతం చేయాలన్నారు.
చెడ్డ పేరు తీసుకు రావొద్దు
డీఎంకే శ్రేణులకు స్టాలిన్ క్లాస్
అధిష్టానాన్ని ధిక్కరించే ఘటనలు విచారకరమని వ్యాఖ్య
ఏడాది పొడవున కరుణానిధి
శత జయంతి ఉత్సవాలు
జూన్ 3న తిరువారూర్‌లో
భారీ బహిరంగ సభ
వాడవాడలా కరుణ శతజయంతి సభలు..
దివంగత డీఎంకే అఽధినేత కరుణానిధి శతజయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా వాడవాడల్లో ఏడాది పొడవున నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. కరుణానిధి శత జయంతి ఉత్సవాలను కేడర్ తమ ఇంటి వేడుకగా, ప్రజా ఉత్సవంగా నిర్వహించాలని సూచించారు. జూన్ 3వ తేదీన శతజయంతి ఉత్సవాల బహిరంగ సభ తిరువారూర్ వేదికగా జరగనున్నట్లు ప్రకటించారు. ఇందులో జాతీయస్థాయి నేతలు పాల్గొంటారని వివరించారు. ఇక్కడే కరుణానిధి స్మారంగా భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.