
టీచర్లపై దాడి చేస్తున్న శివలింగం తదితరులు
తిరువొత్తియూరు: పాఠశాలలోకి చొరబడి హెచ్‌ఎంతోపాటు ఉపాధ్యాయులపై దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడి జిల్లా ఎటాయపురం సమీపంలో వున్న కీల్‌నంబిపురంలో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ గురవమ్మాళ్ (56) ప్రధాన ఉపాధ్యాయినిగాను, భరత్ (40) ఉపాధ్యాయుడిగానూ పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో 20 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన శివలింగం, సెల్వి దంపతుల కుమారుడు ప్రదీప్ రెండవ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ప్రదీప్ హోమ్ వర్కును ఇంటిలో వారు రాసినట్టు గుర్తించి ఉపాధ్యాయులు మందలించారు. ఈ సంగతి తెలుసుకున్న ప్రదీప్ తాత మునస్వామి పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయునితో వాగ్వాదానికి దిగాడు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శివలింగం, సెల్వి, మునస్వామి పాఠశాలలోకి చొరబడి ప్రధానోపాధ్యాయిని గురవమ్మాళ్, ఉపాధ్యాయుడు భరత్‌పై దాడి చేశారు. కుర్చీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎటాయపురం విలాతికులం పోలీసుస్టేషన్ డీఎస్పీ జగదీశ్వర్, పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులపై దాడి చేసిన మునస్వామి, శివలింగం, సెల్విని అరెస్టు చేశారు.