
కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తున్న టీచర్లు
వేలూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ప్రాఽథమిక పాఠశాల టీచర్‌ల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర మాజీ అద్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సెకండరీ టీచర్‌లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఆరవ, ఏడవ కేంద్ర వేతన సవరణ సంఘం జీతాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాధ్యమిక ఉపాధ్యాయుల వేతన వ్యత్యాసాలను పూర్తిగా తొలగించి సమాన పనికి సమాన వేతనం అందజేయాలన్నారు. అంగన్‌వాడీల్లోని టీచర్ ట్రైనీల నియామకం వంటి విద్యా సంక్షేమానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను జాతీయ విద్యా విధానాలను తొలగించాలన్నారు. ఒకే దేశం ఒకే విధానం అనే ఏడవ కేంద్ర వేతన సంఘం సిపార్సులను అమలు చేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వమే నేరుగా ఉపాధ్యాయులకు వైద్య బీమా పథకం ప్రయోజనాలను అమలు చేయాలని, వృత్తి భద్రత చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను ఇప్పటికై నా స్పందించి పరిష్కరించుకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షా కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉప కార్యదర్శి భానుమతి, జిల్లా కార్యదర్శి కుప్పరాజన్, జిల్లా అధ్యక్షులు గీత, విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సత్యానందన్ తదితరులు పాల్గొన్నారు.