పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఖర్చుల లెక్క చెప్పాల్స
భానుపురి (సూర్యాపేట), నాగారం : పంచాయతీ బరిలో నిల్చిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల లెక్కలు విధిగా చెప్పాల్సిందే. లేకుంటే అనర్హత వేటు పడనుంది. పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్టువేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఖర్చుకు పరిమితి విధించింది. ఎన్నికల ప్రచారానికి పెట్టే ప్రతీ పైసాకు కచ్చితంగా లెక్కలు సమర్పించాలని సూచించింది. ఈసీ ఇచ్చిన పుస్తకాల్లో అభ్యర్థులు ప్రచార వ్యయ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ వివరాలు వెల్లడించడంలో నిర్లక్ష్యం వహించినా.. పరిమితికి మించి ఖర్చు చేసినా వేటు వేయనుంది. 2019 ఎన్నికల సందర్భంగా సకాలంలో లెక్కలు తెలపని జిల్లాలోని 240 మందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. వీరిలో గెలుపొందిన వార్డుమెంబర్లతో పాటు ఓడిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు.
ఈసీ నిర్ణయించిన ధరల ప్రకారమే..
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డుకు పోటీ చేసే అభ్యర్థుల తరఫున రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చును కూడా వారి ఖాతాల్లోనే జమ చేస్తారు. ఖర్చుపై ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ బృందాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు.. వీడియోలు, ఫొటోల ద్వారా లెక్కిస్తారు. ప్రచార సామగ్రికి ఎన్నికల సంఘం ముందుగానే ధరలు నిర్ణయించగా.. దాని ప్రకారమే అభ్యర్థుల ఖర్చులు చూపాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలుకు రెండు రోజుల ముందే ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచి దాని ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి. ఐదు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలో వార్డు సభ్యులు రూ.30 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉంటే వార్డు సభ్యులు రూ.50 వేలు, సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షల వరకు వెచ్చించే అవకాశం ఉంది.
వివరాల నమోదు..
అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ప్రచార ఖర్చును ఏ రూపంలో నిల్వ చేసుకున్నారో వివరాలను పొందుపరుస్తూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాలి. రిటర్నింగ్ అధికారి అందించిన పుస్తకాల్లో ప్రచార ఖర్చుల వివరాలను నమోదు చేయాలి.
మూడు విడతలుగా తనిఖీలు..
అభ్యర్థుల ప్రచార ఖర్చుల లెక్కలను అధికారులు పరిశీలిస్తుంటారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసింది మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు వ్యయాన్ని మూడు దఫాలుగా తనిఖీలు చేస్తారు.
45 రోజుల్లో తెలియజేయకుంటే..
నామినేషన్ సమర్పణ నుంచి పోలింగ్ ముగిసే వరకు వ్యయాన్ని మూడు విడతల్లో అధికారులు తనిఖీ చేస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లోగా వ్యయం వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే సంబంధిత వార్డు, సర్పంచ్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి వారిపై అనర్హత వేటు వేసే అవకాశముంది. అయితే గెలిచిన అభ్యర్థులు అయితే తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది. వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినా.. వివరాలు సమర్పించకుంటే అనర్హత వేటు ప్రకారం ఈ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా చాలామంది పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ అంశాన్ని పట్టించుకోరు. అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే కొద్ది సమయానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున నిర్లక్ష్యం వహిస్తే రానున్న మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీకి అర్హులు కాకుండా పోతారు. అందువల్ల పోటీ చేసిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఖర్చులను తెలియజేయడంతో పాటు పరిమితికి లోపు ఖర్చు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు సూచిస్తున్నారు.
నామినేషన్ల దాఖలు నుంచే
పరిగణనలోకి..
జనాభా ప్రాతిపదికన ఖర్చుల పరిమితి
మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50వేలు..
2019 ఎన్నికల్లో లెక్కలు సమర్పించని 240 మందిపై అనర్హత వేటు
అభ్యర్థులు అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తప్పవంటున్న అధికారులు
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఖర్చుల లెక్క చెప్పాల్స


