విద్యార్థుల సమగ్ర ప్రగతి నివేదిక
సమగ్ర అభివృద్ధిపై..
పాఠశాలల్లో ఇచ్చే హెచ్‌పీసీ కార్డు విద్యార్థి సమగ్రఅభివృద్ధిని అన్నికోణాల్లో అంచనా వేస్తుంది. వారి వ్యక్తి గత వివరాలతో పాటు, శారీరక, మానసిక సామర్థ్యాలు, అవగాహన, సున్నితత్వం, పాఠశాలల్లో నిర్వహించే కృత్యాల్లో విద్యార్థి ప్రతిభ, ప్రశ్నలపై సమయస్ఫూర్తి, వాటి వివరణ తదితర వాటిని నిక్షేపించనున్నారు. ఈ విధానంతో జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్, కేంద్రీయ, నవోదయ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరగనుంది. తమ పిల్లలకు సంబంధించిన అకడమిక్ అంశాలను తల్లిదండ్రులు నేరుగా చిన్నప్పటి నుంచి అతని ప్రతిభను చూడటానికి అవకాశం ఉంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు త్వరలోనే అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
నాగారం : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం విద్యా సంస్థల్లో విద్యార్థులకు అందిస్తున్న ప్రోగ్రెస్ కార్డు విధానం మారనుంది. కేవలం మార్కులకే పరిమితమైన ఈ ప్రగతి పత్రం.. ఇక నుంచి అన్నిరకాల అంశాలతో మిళితమై ఉండనుంది. ఇదే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు (హెచ్‌పీసీ). జాతీయ విద్యా విధానం (ఎస్‌ఈపీ) 2020లో ప్రతిపాదించిన విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థుల మూల్యాంకన విధానంలో సమూల మార్పులు చేస్తున్నారు. ఇందుకు ‘పరాఖ్’ (పర్‌ఫామెన్స్ అసెస్‌మెంట్ రివ్యూ, అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఇప్పటివరకు కొనసాగుతున్న సమ్మెటీవ్, విద్యార్థుల బట్టీ విధానానికి స్వస్తి పలకనుంది. విద్యార్థుల్లో విశ్లేషణ, విమర్శనాత్మక ఆలోచనలు, భావనాత్మక స్పష్టత వంటి ఉన్నతస్థాయి విద్యా నైపుణ్యాలను పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 981 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్‌స్కూల్స్‌లలో విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉండనుంది.
జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా రూపకల్పన
త్వరలో అమలుచేసేలా ప్రణాళిక
981 పాఠశాలల్లో 45,841 మందికి ప్రయోజనం


