మూడో విడతకు సిద్ధం
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్నీ సిద్ధమయ్యాయి. బుధవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, హుజూర్‌నగర్, మఠంపల్లి మండలాల్లోని 146 గ్రామపంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఉన్న 146 పంచాయతీల సర్పంచ్‌లు, 1,318 వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్ల దాఖలు నుంచి పరిశీలన వరకు పనులు చకాచకా సాగిపోతున్నాయి. ఇక మూడో విడత ప్రారంభంతో జిల్లా అంతటా ఎన్నికల సందడి నెలకొంది. చివరి దశ పోలింగ్ ఈనెల 17వ తేదీన జరగనుంది.
2,10,219 మంది ఓటర్లు
మూడో విడత ఎన్నికల్లో 2,10,219 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 146 గ్రామపంచాయతీలకు గాను 1,333 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం 38 క్లస్టర్లను సిద్ధం చేశారు. మంగళవారం రాత్రికే సామగ్రితో పాటు అధికారులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. వారం రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ రావడం, మొదటి, రెండోదశల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగడంతో మూడోవిడతలో ఆశావాహులు భారీగా నామినేషన్ల దాఖలుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పోటీలో ఉండే అభ్యర్థులు సైతం ఖరారైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
రెండో విడత చివరిరోజు భారీగా ర్యాలీలతో..
రెండో విడత ఎన్నికల్లో చివరి రోజు కొన్ని చోట్ల అభ్యర్థులు భారీగా ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల్లో పూజలు చేసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండోవిడత ఎన్నికలు జరిగే చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని 181 పంచాయతీ సర్పంచ్‌లు, 1,628 వార్డు సభ్యుల ఎన్నిక కోసం చివరిరోజు నామినేషన్లను అధికారులు స్వీకరించారు. తొలిరోజు సర్పంచ్ 67, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు భారీగా సర్పంచ్‌లకు 479, వార్డులకు 993 చొప్పున నామినేషన్లను ఆశావహులు సమర్పించారు. ఈ విడత నామినేషన్ల స్వీకరణకు చివరిరోజు కావడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియను అధికారులు చేపట్టారు. సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి క్యూలైన్లలో ఉన్న అందరి నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి స్వయంగా పరిశీలించారు.
మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలు
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఏడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి
రెండో విడతకు రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ
మండలం పంచాయతీలు వార్డులు క్లస్టర్లు
చింతలపాలెం 16 148 04
గరిడేపల్లి 33 300 08
హుజూర్‌నగర్ 11 110 04
మఠంపల్లి 29 254 05
మేళ్లచెర్వు 16 152 05
నేరేడుచర్ల 19 168 06
పాలకవీడు 22 186 06
మొత్తం 146 1,318 38
మూడో విడతకు సిద్ధం


