పంచాయతీ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ దిశా నిర్దేశం
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంతి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా హుజూర్‌నగర్ చేరుకున్న మంత్రి స్థానిక క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపుపై వారికి పలు సూచనలు, సలహాలు అందించారు.
నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలి
చిలుకూరు: నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవి నాయక్ సూచించారు. బుధవారం చిలుకూరు మండలం బేతవోలు, చిలుకూరు గ్రామాల్లో నామినేషన్ క్లస్టర్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులకు హెల్ప్ డెస్క్‌పై అవగాహన కల్పించి నామినేషన్ పత్రాల్లో తప్పులు లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు పూరించడంలో సహకారం అందించాలన్నారు. నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఆయన కోరారు. ప్రజలు కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు షరీఫుద్దీన్, సత్యనారాయణ, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడేవారిని ఎన్నుకోవాలి
హుజూర్‌నగర్ : ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కోరారు. మంగళవారం హుజూర్ నగర్‌లోని అమరవీరుల భవన్‌లో నిర్వహించిన సీపీఎం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో సేవ చేసేవారిని, ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపు నిచ్చారు. ఎన్నికల్లో లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలిసి ముందుకు పోతున్నామన్నారు. జిల్లాలో మొదటి, రెండో విడతలో అనేక గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్ , వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీతో, మరి కొన్నిచోట్ల ఇతర ప్రజాతంత్ర శక్తులతో కలిసి పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. సమావేశంలో ఎన్. పాండు, పల్లె వెంకటరెడ్డి, పాండ నాయక్, దుగ్గి బ్రహ్మం, హుస్సేన్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉమ్మడి
జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ –16 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక ఈనెల 4వ తేదీన నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనొద్దీన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్లతో లీగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన వారు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, బోనోఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని వివరించారు. ఇతర వివరాలకు 9885717996, 6303430756 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
పంచాయతీ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ దిశా నిర్దేశం


