
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఆరేళ్లుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనంసాగిస్తున్న పేదలకు శాశ్వతంగా పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ కోరారు. బుధవారం ఈ మేరకు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఽసీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామశివారులో గల 126 సర్వేనంబర్‌లో, అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 243, 244లో గల ప్రభుత్వ భూములను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించుకోగా ఎన్నో నిర్బంధాలు, అరెస్టులను ఎదుర్కొని వాటిలో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ విషయమై అధికారులు విచారణ చేసి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వడమే కాకుండా వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విచారణ చేపట్టి అర్హులైన వారికి పట్టాలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్, పార్టీ జిల్లా నాయకులు వాస పల్లయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, నాయకులు విజయ్, రజాక్, మరియమ్మ, సైదులు, సత్తెమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.