
ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు
సూర్యాపేట : రైతులు ఆయిల్ పాం సాగు చేసి అధికలాభాలు ఆర్జించవచ్చని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో ఉద్యానవన అధికారులు, పతంజలి కంపెనీకి చెందిన అధికారులతో జిల్లాలో ఆయిల్ పాం సాగుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆసక్తి చూపిన రైతులకు చెందిన 800 ఎకరాల్లో 15రోజుల్లో ఆయిల్ పాం మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు డ్రిప్ట్ ఇరిగేషన్ కోసం డీడీలు త్వరగా తీయించాలని, ఎవరైనా ఆర్థిక సమస్య ఉన్న రైతులుంటే వారికి సహకార బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి డ్రిప్ ఇరిగేషన్‌కు డీడీలు తీయించాలన్నారు. ఆయిల్ పాంసాగుపై రైతుల సందేహాలు నివృత్తి చేయడానికి కాల్ సెంటర్, మొబైల్ యాప్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 4,740 ఎకరాలలో ఆయిల్ పాం సాగు అవుతోందని, 2025 – 26 సంవత్సరంలో నూతనంగా 3000 ఎకరాల సాగు లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, ఉద్యానవన టెక్నికల్ అధికారి మహేష్, మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ నరేష్, పతంజలి కంపెనీ అధికారులు యాదగిరి, హరీష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్