
సాగర్ మేజర్లు అధ్వానం
కాల్వ కట్టలు
బలహీనంగా ఉన్నాయి
మా గ్రామ సమీపాన ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ కట్టలు పలుచోట్ల బలహీనంగా మారాయి. పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే కట్టలపై నీరు పొంగిపొర్లుతుంటుంది. గత యాసంగిలో కట్టపై నీరు పొంగిపొర్లింది. గతంలో కూడా పలు చోట్ల గండ్లు కూడా పడ్డాయి.
– రామిని సైదిరెడ్డి, రైతు రత్నవరం
కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి
పాలారం మేజరు కాల్వ నాచు, మట్టితో పూడుకుపోయింది. పలు చోట్ల లైనింగ్ దెబ్బతిన్నది. వల్లాపురం నుంచి త్రిపురవరం వరకు కాల్వలో స్థానిక రైతులు స్వచ్ఛందంగా పూడికను తొలగిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పాలారం మేజర్‌కు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి.
– దొంతగాని భద్రయ్య, రైతు సిరిపురం
నడిగూడెం : మండల పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న పలు మేజరు కాల్వలు అధ్వానంగా మారాయి. పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో పలుచోట్ల మేజర్లు, మైనరు కాల్వలకు ఇరువైపులా కంపచెట్లు, లైనింగ్‌లు దెబ్బతిన్నాయి. కాల్వ కట్టలు బలహీనంగా మారాయి. మరికొన్ని చోట్ల కాల్వలు మట్టి, నాచుతో పూడుకుపోయి నీటి ప్రవాహం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
చివరి భూములకు నీరందక ఆందోళన
మండల పరిధిలోని సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా రామాపురం వద్ద 13–బీ కొమరబండ మేజరు కాల్వ రామాపురం నుంచి ఎకలాస్‌ఖాన్‌పేట, తెల్లబెల్లి, కొమరబండ వరకు 16 కిలోమీటర్ల పొడవున ఉంది. ఈ కాల్వ కింద దాదాపు 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే చాకిరాల వద్ద 14–ఏ కొత్తగూడెం మేజరు కాల్వ శ్రీరంగాపురం, రత్నవరం, వాయిలసింగారం, తెల్లబండతండా, గోల్‌తండా, అనంతగిరి, శాంతినగర్, గోండ్రియాల గ్రామీల మీదుగా మంగళతండా వరకు 27 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ కాల్వ కింద దాదాపు 27 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే సిరిపురం వద్ద 14–బీ పాలారం మేజరు కాల్వ సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం, పాలారం, చనుపల్లి గ్రామాల వరకు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికింద దాదాపు 14 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్నది. అయితే ఈ కాల్వలకు పలు చోట్ల మైనరు కాల్వలు కూడా ఏర్పాటు చేశారు. కానీ కాల్వ పలుచోట్ల పూడిపోయి ఇరువైపులా కంపచెట్లు పెరిగి చాలా చోట్ల లైనింగ్ పూర్తిగా దెబ్బతిని ఉంది. షట్టర్‌లు సరిగ్గా లేవు. దీంతో చివరి భూములకు నీరందడం లేదని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. గత్యంతరం లేక బోర్లు వేయించుకుని, బావులు తీయించి పంటలు సాగు చేసుకుంటున్నామని రైతులు వాపోతున్నారు.
వేధిస్తున్న లష్కర్ల కొరత
కొమరబండ, కొత్తగూడెం, పాలారం మేజరు కాల్వల నిర్వహణ బాధ్యతలు చూసే లష్కర్ల కొరత ఏళ్ల తరబడి వేధిస్తోంది. దీంతో కాల్వలపై పర్యవేక్షణ కొరవడింది. ఉన్న కొద్దిపాటి సిబ్బందితో నీటి పారుదల శాఖ నెట్టకొస్తోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కాల్వలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి, ఖాళీగా ఉన్న లష్కర్ పోస్టులను భర్తీ చేసి చివరి భూములకు నీరందేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఫ ఇరువైపులా దెబ్బతిన్న లైనింగ్
ఫ కాల్వల పొడవునా పెరిగిన కంపచెట్లు
ఫ పలుచోట్ల మట్టితో పూడుకుపోయిన దుస్థితి
ఫ చివరి భూములకు అందని సాగునీరు
ఫ ఆందోళనలో ఆయకట్టు రైతాంగం
మేజర్ పేరు పొడవు ఆయకట్టు
(కి.మీ.) (ఎకరాల్లో..)
13–బీ కొమరబండ 16 16,000
14–ఏ కొత్తగూడెం 27 27,000
14–బీ పాలారం 14 14,000

సాగర్ మేజర్లు అధ్వానం

సాగర్ మేజర్లు అధ్వానం

సాగర్ మేజర్లు అధ్వానం