
అకాల వర్షం.. ఆగమాగం
తిరుమలగిరి, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్): తిరుమలగిరి, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో గురువారం రాత్రి, తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తిరుమలగిరి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు జలమమయమయ్యాయి. అక్కడక్కడా స్వల్పంగా ధాన్యం తడిసింది. తుంగతుర్తి మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కనీసం ధాన్యం రాశుల వద్ద కూడా రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ధాన్యం రాశుల మధ్య నీరు నిలిచి కొంత మేర వరదకు కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆత్మకూర్ (ఎస్) మండలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ముక్కుడుదేవులపల్లిలో పిడుగుపాటుకు గురై బయ్య సోమయ్యకు చెందిన గేదె మృతి చెందింది. రామన్నగూడెంలో తాటిచెట్టుపై పిడుగు పడి చెట్టు దగ్ధమైంది. పలు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాకుండా నిల్వ ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి వేగంగా ధాన్యం కాంటాలు వేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఫ తిరుమలగిరి, ఆత్మకూర్(ఎస్),
తుంగతుర్తి మండలాల్లో కురిసిన వర్షం
ఫ పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో
తడిసిన ధాన్యం రాశులు
ఫ ముక్కుడుదేవులపల్లిలో పిడుగుపడి గేదె మృతి
పిడుగు పాటుకు గృహోపకరణాలు దగ్ధం
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పట్టణంలోని టీచర్స్ కాలనీలోని చిట్యాల రాములమ్మ ఇంట్లో చెట్టుపై పిడుగు పడింది. దీంతో వారింట్లోనే కాకుండా చుట్టుపక్కల వారి ఇళ్లలో విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.

అకాల వర్షం.. ఆగమాగం