
క్షతగాత్రులకు నగదురహిత వైద్యం
తిరుమలగిరి (తుంగతుర్తి): రోడ్డు ప్రమాదాలు సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగి స్తాయి. జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఒకరో ఇద్దరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయా ప్రమాదాల్లో గాయపడుతున్న వారు సైతం అత్యవసర వైద్యసేవలు పొందలేక మృత్యువాత పడుతున్నారు. ఇలా జరిగిన కుటుంబాలకు గుండెకోత మిగులుస్తున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది.
నగదు రహిత వైద్యం
ప్రమాదం జరిగిన గంట (గోల్డెన్ అవర్) లోపు క్షతగాత్రులకు వైద్యం అందితే అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చునని వైద్య నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రహదారుల రవాణా శాఖ కొత్త స్కీంను తెస్తూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్–2025గా నామకరణం చేసింది. బాధితులకు ట్రామా, పాలిట్రామా సేవలు అందించగల సామర్థ్యం కలిగిన అన్ని ఆసుపత్రులను ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని నోటిఫికేషన్‌లో సూచించింది.
ఏడు రోజుల వరకు సేవలు పొందే అవకాశం
మోటారు వాహనం కారణంగా రహదారి ప్రమాదానికి గురైన వారందరూ ఈ పథకం కింద సంబంధిత ఆసుపత్రుల్లో రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యసేవలు పొందేందుకు అర్హులవుతారు. ప్రమాదం జరిగిన నాటినుంచి ఏడు రోజుల దాక ఈ సేవలు పొందవచ్చు. ఆర్థోపెడిక్‌తోపాటు తీవ్ర గాయాలైన వారికి చికిత్స అందించే అన్ని సౌకర్యాలు కలిగిన ట్రామా, పాలిట్రామా కేర్ ఆసుపత్రుల్లోనే ఈ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. రోగికి అయిన వైద్య ఖర్చులను ప్యాకేజీలకు అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రమాద సమాచారం బంధు మిత్రులకు తెలిసేలోగా వైద్య ఖర్చులకు సొమ్ము సమకూర్చే లోగా క్షతగాత్రుల ప్రాణాలు నిలబెట్టడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ఉచిత వైద్యసేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త స్కీంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఫ రోడ్డు ప్రమాదంలో గాయపడిన
వారికి రక్షణగా..
ఫ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టిన కేంద్రం
ఫ రూ.1.50 లక్షల వరకు
ఉచిత వైద్యసేవలు
ఫ ఆర్థోపెడిక్ ఆసుపత్రుల్లో సేవలు
పొందేందుకు అవకాశం
ఫ త్వరలోనే అమలుకు సన్నాహాలు