ఆక్రమణలో ఆదిత్యుని ఇనాం భూములు
● భూముల సర్వేతో వెలుగులోకి
● చేతులు మారిన 35.22 ఎకరాలు
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇనాం భూములు ఆక్రమణకు గురయ్యాయి. సర్వీస్ ఇనాం కింద దశాబ్దాల కాలం క్రితం ఇచ్చిన భూములన్నీ ప్రస్తుతం సర్వీసుదారుల వద్ద లేవని, అక్రమంగా క్రయవిక్రయాలు జరిగినట్లు దేవదాయ శాఖ, రెవెన్యూ శాఖ, సర్వే శాఖల సిబ్బంది సంయుక్తంగా గుర్తించారు. సూర్యదేవాలయ ఇనాం సర్వీస్ కింద అప్పట్లో సన్నాయి కళాకారులకు, దివిటి మోపరులకు, కీర్తనల సిబ్బంది, వేదపారాయణదారులకు 35.22 ఎకరాల విస్తీర్ణంలో భూములు కేటాయించారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు బుధవారం జిల్లా దేవదాయ శాఖాధికారి/సహాయ కమిషనర్ బి.ఆర్.వి.వి.ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో తహశీల్దార్ గణపతిరావు, సర్వేయర్లు ప్రియ, దుర్గాప్రసాద్‌ల బృందం మొత్తం 17 సర్వేనంబర్లలో ఉన్న భూములను పరిశీలించారు. అరసవల్లి గ్రామానికి ఆనుకుని ఇనాం భూముల్లో భారీ భవంతులు వెలిశాయని, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరిగాయని, భూములన్నీ సర్వీసుదారుల నుంచి చేతులు మారాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల ప్రస్తుత పరిస్థితిని నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌బాబు, పలు ఆలయాల ఈవోలు ప్రభాకరరావు, సర్వేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ బాలసాయి తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక
అరసవల్లి ఆలయ ఇనాం భూములను పరిశీలించాం. కొన్నిచోట్ల నిర్మాణాలుంటే, మిగిలిన చోట వరిపంటలున్నాయి. ఈ వివరాలను అధికారిక ఫార్మాట్‌లో సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. తదుపరి మంత్రివర్గ నిర్ణయాల మేరకు చర్యలు చేపడతాం. – ప్రసాద్ పట్నాయక్,
జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్


