
బ్యాగులు కట్ చేసి.. పొదుపు సొమ్ము దోచేసి..
రణస్థలం: కొచ్చెర్ల పంచాయతీకి చెందిన ఇద్దరు మహిళల నుంచి లక్ష రూపాయల నగదును గుర్తు తెలియని ముగ్గురు మహిళలు దోచుకున్నారు. జె.ఆర్.పురం పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చెర్ల గ్రామంలో శ్రీశ్రీనివాస పొదుపు సంఘానికి చెందిన 10 మంది సభ్యులు గురువారం జె.ఆర్.పురం మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్‌కు వచ్చారు. రూ.20లక్షలు పొదుపు సొమ్ము విత్‌డ్రా చేశారు. ఒక్కొక్కరు రూ.2లక్షల చొప్పున బ్యాంకులోనే పంచుకున్నారు. బయటకు వచ్చాక వారిలో ముగ్గురు సభ్యులు బ్యాంకు సమీపంలోనే ఉన్న వస్త్ర దుకాణంలోకి వెళ్లారు. అప్పటికే వారితో సఖ్యతగా మెలిగిన గుర్తు తెలియని ముగ్గురు మహిళలు అదే దుస్తుల దుకాణంలో వెళ్లి డ్వాక్రా మహిళల బ్యాగులు చాకచక్యంగా కోసేశారు. వీరిలో బస్వ గురమ్మ, లంకపల్లి మాధురి బ్యాగుల్లో రూ.50వేలు చొప్పున లక్ష రూపాయలు దోచుకున్నారు. మరొకరి బ్యాగ్ కట్ చేసినా నగదు తీయడం సాధ్యంకాలేదు. అనంతరం చోరీ చేసిన మహిళలు బయటకు జారుకున్నారు. కొంతసేపటి తర్వాత చోరీ జరిగిన విషయం తెలుసుకుని బాధిత మహిళలు ఆందోళనకు గురై పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి జె.ఆర్.పురం పోలీసులు చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. కాగా, గతంలో ఇదే వీధిలో కనకదుర్గా జ్యూయలర్స్‌లో వెండిని ఇలానే ముగ్గురు మహిళలు దోచుకున్నారు. మరోసారి ఇప్పుడు చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

బ్యాగులు కట్ చేసి.. పొదుపు సొమ్ము దోచేసి..

బ్యాగులు కట్ చేసి.. పొదుపు సొమ్ము దోచేసి..