
దళిత విద్యార్థులకు న్యాయం చేయండి
కాశీబుగ్గ: పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బాలికల/బాలుర గురుకుల పాఠశాలలు 1983లో స్థాపించారని సుమారుగా 30 ఏళ్ల నుంచి అవే భవనాలు ఉండడం, కొత్త భవనాలు అరకొరగా ఉండడం, మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు. గత 15 ఏళ్లుగా గురుకులాల్లో దళిత విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయని, అందుకు గల కారణాలు విశ్లేషించాలని కోరారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేకమైన కమిటీతో అధ్యయనం చేయించాలని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, బెలమర ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి మద్దిల వినోద్, జిల్లా కార్యదర్శి యడ్ల గోపి, ధర్మారావు, కరుణాకర్, బి.దుర్యోధన, ఎన్‌జీఓ నాయకులు బోనెల గోపాల్, చల్లా రామారావు, గెజిటెడ్ అధికారుల సంఘం గోజ్జ నాగరాజు, ఆదివాసీ సంఘం నాయకులు వరహాల భాగ్యరావు, వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఇప్పిలి చంద్రశేఖర్, పిలక శ్రీను, ఉదయపురం శ్రీనివాసరావు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.