
వేగం పెంచిన విజిలెన్స్
● ఆదిత్యాలయంలో అక్రమాలపై
వడివడిగా విజిలెన్స్ విచారణ
● గతేడాది ప్రసాదాల విభాగం ఖర్చులపై వాంగ్మూలాల సేకరణ
● వాస్తవాలు చెప్పేసిన రికార్డు అసిస్టెంట్‌పై అక్రమార్కుల గుర్రు
అరసవల్లి:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరసవల్లి ఆదిత్యుని ఆలయంలోని పలు విభాగాల్లో జరిగిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గతేడాది ఆలయ ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ హయాంలో రూ.లక్షల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ.. ఇదే ఆలయంలో పనిచేసి విధుల నుంచి సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు విజిలెన్స్ అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆలయంలో అప్పట్లో జరిగిన పలు అక్రమాలపై విజిలెన్స్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. వాస్తవాలు చెప్పాడని కక్ష..
రికార్డు అసిస్టెంట్ శిమ్మ మల్లేశ్వరరావు పేరిట మొత్తం 19 చెక్కులను రాసేసి..అతని ప్రమేయం లేకుండానే నేరుగా బ్యాంకుల్లో నగదు డ్రా చేయించుకున్నారని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తులకు మజ్జిగ, పాలను పంపిణీ చేయకుండానే సుమారు రూ.3.50 లక్షల వరకు ఆలయ ఉద్యోగులే జేబులు నింపుకొన్నారని తేలింది. ఈ సమాచారంలో వాస్తవాలన్నీ శిమ్మ మల్లేశ్వరరావు పూసగుచ్చినట్లుగా విజిలెన్స్ అధికారులకు చెప్పడంతో ఆ దిశగా విచారణ వేగవంతం చేస్తున్నారు. కాగా, వాస్తవాలన్నీ విజిలెన్స్ అధికారులకు మల్లేశ్వరరావు ఒక్కడే చెప్పేశాడనే విషయం బయటకు పొక్కడంతో అక్రమార్కులంతా కలిసి అతనిని టార్గెట్ చేశారు. ఈయనపై ఇంతవరకు ఎలాంటి రిమార్క్ లేదన్న గుర్తింపు స్థానికంగా ఉంది. అయితే తమ అక్రమాలను బయటపెట్టాడన్న కారణంతో ఎలాగైనా మల్లేశ్వరరావుపై ఏదో ఒక అవినీ తి మరక అంటించాలనేలా ఆ ‘ఉద్యోగులు’ కుట్రలకు దిగినట్లు సమాచారం.
ప్రసాద విక్రయాలను సాకుగా చూపించి..
కొత్తగా ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కె.శోభారాణి ఈ నెల 4న ప్రసాదాల విక్రయాలను తనిఖీ చేయగా తక్కువగా విక్రయాలు జరుగుతున్నాయని గుర్తించారు. గతేడాది వైశాఖ తొలి ఆదివారంలో ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4 లక్షల వరకు ఆదాయం రాగా.. మొన్నటి తొలి ఆదివారం (ఈనెల 4న) కేవలం రూ.2.20 లక్షల వరకు మాత్రమే ఆదాయం రావడంపై ఈవో మండిపడ్డారు. గత ఏడాది వైశాఖంలో పక్కా భవనాల్లో ఆలయానికి ఎదురుగా విక్రయాలు జరిగాయని, ఇప్పుడు భవనాలన్నీ కూల్చేయడంతో తాత్కాలిక భవనాల్లో ప్రసాదాల కౌంటర్లకు భక్తుల రాక తగ్గిందని అందుకే ఆదాయం కొంత తగ్గిందనే విషయం ఆలయ వర్గాలకు తెలిసినా.. దాన్ని ప్రస్తావించకుండా ఆదాయం తగ్గడానికి ప్రసాదాల విభాగంలో పనిచేస్తున్న మల్లేశ్వరరావు మాత్రమే కారకుడనేలా ఈవోకు ఫీడ్‌బ్యాక్ అందించారు. ఇక్కడి రాజకీయాలు తెలియని ఈవో శోభారాణి తొలి ఆదివారం ఆదాయం తగ్గడానికి కారకుడిగా మల్లేశ్వరరావుపై చర్యలు చేపడతానంటూ శివాలెత్తడం గమనార్హం.