
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి
పాతపట్నం: ప్రజలు ఇచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారులను ఆదేశించారు. పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం సమీపంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. తాగునీరు, పింఛన్, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ తదితర సమస్యలపై పలువురు దరఖాస్తులు అందజేశారు. పాతపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం మద్యం షాపును తొలగించాలని స్థానిక మహిళలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డ్వామా పీడీ బి.సుధాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ద్వారకపురంలో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో చంద్రకుమారి, సర్పంచ్ అన్నెపు సుజాత తదితరులు పాల్గొన్నారు.