
● ప్రత్యేక స్పందనలో మంత్రి సీదిరి అప్పలరాజు
కాశీబుగ్గ: పలాసలో ‘ఆ నలుగురు’ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ తనను ఉద్దేశించి ఎల్లో మీడియాలో తరచూ వార్తలు రాస్తున్నారని, ఆ నలుగురి పేరిట ఇంచీ భూమి ఉన్నట్లు నిరూపించినా రాజకీయాల నుంచి విరమిస్తానని రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తన అనుచరులు ఎవరు తప్పు చేసినా తాను తప్పు చేసినట్లేనని, అక్రమాలు జరిగినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకుల మీదా ఫిర్యాదులు వచ్చాయని, వజ్జ బాబూరావు, డిక్కల ఆనంద్, కుత్తుం లక్ష్మణరావు ఇలా అనేక మంది నాయకులు ఆక్రమణలు చేశారని చెప్పారు. అవి కోర్టులో ఉన్నాయని, ఆ ఆక్రమణలు కూడా తొలగిస్తామని చెప్పారు. గౌతు కుటుంబం 60 ఏళ్లపాటు ఈ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించిందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తరువాత పలాస అభివృద్ధికి అన్నీ తీసుకువచ్చామని తెలిపారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు నిరాధారమైన వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. అప్పటి ఎమ్మెల్యే శివాజీ హయాంలో అక్రమాలు జరిగితే అదేదో తాము చేసినట్లు తమపై రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ అల్లుడు పలాసలో ఏ వ్యాపారాలు చేసినా వారి వద్ద కమీషన్లు దండుకునేవారని ఆరోపించారు. పలాసకు ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయని, స్వేచ్ఛాయుతంగా వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ నాయకుడు, చైర్మన్‌గా పనిచేసిన వజ్జ బాబూరావు కాలువలో పాఠశాల కట్టారని, జగన్నాథసాగరంలో 8 ఎకరాల స్థలం ఆక్రమించి వెంచర్ వేయడం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఎర్రచెరువు లేఅవుట్ బాబూరావు వేసింది కాదా అని ప్రశ్నించారు. డిగ్రీ కళాశాలకు మూడున్నర ఎకరాలు, పెంటిపద్రలో నాలుగు ఎకరాలు యాభై సెంట్లను తెలుగుదేశం బడానాయకుడు పెంట ఉదయ్‌కుమార్ వద్ద రికవరీ చేశామని చెప్పారు. బొడ్డపాడులో 7 ఎకరాలు, రెంటికోటలో 80 సెంట్లు, ఇంగిలిగాంలో ఎకరా ఎనభై సెంట్లు, జయరామచంద్రపురంలో లొడగల కామేష్ వద్ద రెండు ఎకరాలు, మార్కెట్ కమిటీ వద్ద రెండు ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. రెండు మూడు నెలల తర్వాత మళ్లీ స్పందన నిర్వహించి చర్యలు చేపడతామన్నారు.