‘మిషన్’ ఫెయిల్!
కదిరి అర్బన్: మహిళల స్వయం అభివృద్ధి కోసం జిల్లాలో నిర్వహించిన కుట్టు శిక్షణ ‘ఫెయిల్’ అయ్యింది. జిల్లాలోని 59 కేంద్రాల్లో 8,097 మంది మహిళలు 3 నెలల పాటు కుట్టుపై శిక్షణ పొందారు. గత అక్టోబర్‌లోనే శిక్షణ పూర్తి చేసుకున్నా... ఇంతవరకు వీరికి కుట్టు మిషన్లు అందజేయలేదు. మహిళా సాధికారితకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రికి బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణ వృథా..
ఇంటివద్దనే టైలరింగ్ చేసుకుని ఆదాయం సమకూర్చుకోవచ్చన్న ఆశతో ఎందరో మహిళలు వ్యయప్రయాసల కోర్చి కుట్టు శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ సమయంలో కేంద్రాలను సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు అర్హత ఉన్న వారికి బ్యాంకు రుణాలు సైతం ఇప్పిస్తామని చెప్పడంతో మహిళలంతా ఎంతో ఆశపడ్డారు. శిక్షణ పూర్తయి రెండు నెలలు దాటినా మిషన్లే ఇవ్వలేదు. దీంతో శిక్షణ సమయంలో నేర్చుకున్నదంతా వృథా అయ్యిందని అభ్యర్థులు వాపోతున్నారు.
ట్రైనర్లకు సైతం జీతాల్లేవ్!
జిల్లా వ్యాప్తంగా కుట్టు శిక్షణా కేంద్రంలో మహిళలకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్లకు జీతాలు సైతం ఇవ్వలేదు. దీంతో వారంతా జీతాల కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వారికే జీతాలు ఇవ్వనపుడు తమకు మిషన్లు ఇస్తారో ఇవ్వరో అని పలువురు లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల స్వయం ఉపాధికి కుట్టు శిక్షణ
మూడు నెలల పాటు శిక్షణ పొందిన మహిళలు
నేటికీ కుట్టుమిషన్లు పంపిణీ చేయని వైనం
మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచి తద్వారా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతామని
చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పింది. కుట్టు శిక్షణ ద్వారా ఇంటివద్దే ఉపాధి కల్పిస్తామని
మహిళల్లో ఆశలు రేపింది. మూడు నెలల కోర్సు పూర్తి చేస్తే చాలు మిషన్ కూడా అందిస్తామని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పారు. కానీ
ఆచరణలో మాత్రంలో చేసి చూపలేకపోయారు.


