కల్యాణం.. కమనీయం
మడకశిర రూరల్: నారసింహుడి నామస్మరణతో జిల్లేడుగుంట మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తరపల్లి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. తొలుత అర్చకులు భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ భక్తుల జయజయ ధ్వానాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ లక్ష్మీనారసింహుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి తరించారు. కల్యాణోత్సవంలో ఉభయదారులుగా హరేసముద్రం సీతాలక్ష్మి, హెచ్‌ఎస్ హనుమంతరావు కుటుంబం వ్యవహరించింది. అంతకుముందు ఆంజనేయస్వామి దేవాలయంలో పురోహితులు హోమం, వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు బ్రహ్మరథోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నారు. జిల్లేడుగుంట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉదయం 11.15 గంటల బ్రహ్మరథోత్సవం ప్రారంభమవుతుందని దేవదాయశాఖ అధికారులు తెలిపారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
కల్యాణం.. కమనీయం


