కలెక్టర్ సుడిగాలి పర్యటన
పుట్టపర్తి అర్బన్: బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఆర్డీఓ సువర్ణ, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. మొదట బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామ పరిధిలోని కొట్టాలపల్లిలో ఉపాధి పనుల కింద చేపట్టిన ఉద్యాన పంటలు, మామిడి తోటలు, నీటి నిలువ గుంతలను పరిశీలించారు. తర్వాత కొత్తచెరువు మండలం కొత్తపల్లిలో ఫారంపాండ్లు, ఉద్యాన తోటలు, డ్రిప్ సదుపాయాలను పరిశీలించారు. నారేపల్లిలో రైతులతో మాట్లాడారు. రాసింపల్లిలో మామిడి తోటలను చూశారు. ఫ్రూట్ కవర్లు, ఫ్‌లైట్రాప్, సేంద్రియ ద్రావణాల తయారీ తదితర విధానాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
పాఠాలు బోధించిన కలెక్టర్
కలెక్టర్ శ్యాంప్రసాద్ బుక్కపట్నం ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులతో ఆరాతీశారు. అనంతరం పాముదుర్తి ఉన్నత పాఠశాలలో బోర్డుపై స్వయంగా ఇంగ్లిష్, హిందీని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించారు. పలు ప్రశ్నలు సంధించి సమాధానాలను రాబట్టారు. అక్కడి నుంచి పాముదుర్తిలో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించారు. అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాయింట్ ఎల్‌పీఎంలను రూపొందించకూడదని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీహెచ్‌ఓ చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, డిఈఓ కిష్టప్ప, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లా ఆస్పత్రుల్లో వైద్య సేవలు బలోపేతం చేయడంతో పాటు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వైద్య సేవలు, ఆస్పత్రి భవన నిర్మాణ పురోగతి, శానిటేషన్ మెరుగుదలపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అంచనాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రుల్లో టెస్టులు, మందులు, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఽ ధర్మవరం, మడకశిర, కదిరి, తనకల్లు, పెనుకొండ, నల్లమాడ ఆస్పత్రుల భవన మరమ్మతు పనులను పూర్తి చేయాలన్నారు.
బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో పొలాలు, ఉపాధి పనుల పరిశీలన


