ఉచితం మాటున ‘ఇసుక దందా’
గోరంట్ల: గృహ అవసరాల పేరుతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గృహ నిర్మాణా అవసరాలతో పాటు ఇతర అవసరాలకు వాగులు, వంకల నుంచి ఇసుక తరలించుకోవచ్చని చంద్రబాబు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఇసుక రీచ్‌లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అధికార పార్టీ నాయకులు వాగులు, వంకల్లోని ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇబ్బందుల్లో ప్రజలు
గోరంట్ల మండలంలో ఇసుక దొరకకపోవడంతో గృహ, ఇతర నిర్మాణ పనులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయడంతో ఇసుక కొరత ఉండేది కాదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను తీసివేశారు. దీంతో గోరంట్ల మండలంలో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన అధికార పార్టీ నాయకులు పరిగి, రొద్దం మండలాల్లోని నదుల నుంచి నిత్యం ఇసుక గోరంట్ల మండలానికి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నారు. రోజూ 20 నుంచి 30 ట్రాక్టర్ల ఇసుక రొద్దం, పరిగి మండలాల నుంచి గోరంట్ల తరలివస్తోదంటే ఇసుక దందా ఎలా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చారు. కళ్ల ముందే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా ఆయా మండలాల పోలీసు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టి రీచ్ ఏర్పాటు చేసి తక్కువ మొత్తానికి ఇసుక వినియోగదారులకు చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.


