
కొనసాగుతున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
ధర్మవరం: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం దీక్షల్లో మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు బొగ్గు నాగరాజు, జయకృష్ణ, అనిల్, కార్మికులు నల్లబ్యాడ్జీలతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీఓ నంబర్ 36 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ జనాభా ప్రాతిపదికన కార్మికుల సంఖ్యను పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు దస్తగిరి, యోగి, కాటమయ్య, పెద్దన్న, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.